పూర్వపు నల్లగొండ జిల్లా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రత్యేకమైనది. కృష్ణా జిల్లా సరిహద్దుల్లో ఆంధ్రవాసనలతో ఉండటమే కాదు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కూడా. ఇక్కడ నుంచి మూడో సారి బరిలోకి దిగబోతున్నారు ఉత్తమ్. 1999 నుంచి 2009 వరకు రెండు సార్లు కోదాడ ఎమ్మెల్యే గా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఉత్తమ్… 2009లో జరిగిన పునర్విభజనలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో 24 వేల మెజారిటీ సాధించారు. అయితే ఉత్తమ్‌ను ఓడించాలని కేసీఆర్.. ప్రత్యేకంగా వ్యూహరనచ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్న అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె తనకు మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు.
కానీ ఈ సారి ఆమెకు కేసీఆర్ టిక్కెట్ ఇంకా ప్రకటించలేదు. కేసీఆర్ మదిలో.. బాగా ఆర్థిక పరిపుష్టి కలిగిన నేతలు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో.. శంకరమ్మ.. తన టిక్కెట్ ఇవ్వకపోతే.. తన కుమారుడిలాగే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారు. సైదిరెడ్డి అనే ఎన్నారై పేరు జోరుగా ప్రచారంలోకి వచ్చింది. యువతకు అండగా ఉండే ఉద్దేశంతో అంకిరెడ్డి ఫౌండేషన్ ను స్థాపించి కొన్నాళ్లుగా సైదిరెడ్డి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కెనడాలో ఐటీ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు చేసి రాజకీయ జీవితం వెదుక్కుంటూ వచ్చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి సహకారం, కేసీఆర్ ఆశీస్సులతో టికెట్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హుజూర్నగర్ టీఆర్ఎస్ లో రెండు వర్గాలుగా మారిపోయింది.
శంకరమ్మ, సైదిరెడ్డి లు ఎవరికివారుగా ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్న కొడుకు తల్లిగా తనను గౌరవించి టికెట్ ఇవ్వాలని శంకరమ్మ, మాతృభూమికి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని సైది రెడ్డి లు అంటున్నారు. వీరిద్దరూ టికెట్ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కెసిఆర్ మాత్రం ఉత్తమ్ కు చెక్ పెట్టే దిశగా బలమైన టీఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి బరిలో దింపుతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ హుజూర్‌నగర్‌లో పోటీ చేసే ప్రశ్నే లేదని… గుత్తా చెప్పినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా.. ఉత్తమ్‌కు కేక్ వాకేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.