మహాకూటమిపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కూటమిలో తెలంగాణ వ్యతిరేకులైన టీడీపీ, కాంగ్రెస్ లు కలిశాయంటూ ఎద్దేవా చేస్తున్నారు కదా! అయితే, గతంలో తెరాస ఓసారి టీడీపీతో పొత్తు పెట్టుకుంది, కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుంది. ఆయా సందర్భాల్లో తెరాస అవసరానికి అనుగుణంగా ఈ రెండు పార్టీలతో కేసీఆర్ కలిసి పనిచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలన్నీ మహాకూటమి గొడుగు కిందకి వచ్చేలా చేశాయి. అయితే, గతంలో తాము పెట్టుకున్న పొత్తుల గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు మంత్రి కేటీఆర్.
నర్సంపేట నియోజక వర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్, టీడీపీ నేతలు తెరాసలో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం తప్పలేదన్నారు. మనం కూడా పెట్టుకున్నామనీ, 2004లో ఢిల్లీ నుంచి కరీంనగర్ కి వచ్చిన సోనియా గాంధీ ‘మీ మనసులో ఏముందో నాకు తెలుసు. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తాం’ అంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వకుండా మోసం చేస్తే… 2009లో కాంగ్రెస్ ని ఓడించాలనే లక్ష్యంతో, కరుడు గట్టిన సమైక్యవాది, తెలంగాణ అంటే పొరపాటున కూడా ఇష్టం లేని చంద్రబాబు నాయుడి తెలుగుదేశం పార్టీని కూడా పొత్తు కావాలని అడిగామన్నారు. అంతేకాదు, వారి మెడలు వంచి, తెలంగాణకు ఒప్పుకుని పాలిట్ బ్యూరోలో తీర్మానం చేసి, కేంద్రానికి ఉత్తరం రాసి తెలంగాణ ఇవ్వాలని కోరిన తరువాతే ఆనాడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. టీడీపీని మనదారిలోకి తీసుకొచ్చామే తప్ప, మనం లొంగిపోలేదన్నారు. ఇవాళ్ల కోదండరామ్ కూడా అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా పొత్తు అంటున్నారనీ, చంపినవాళ్లతోనే పొత్తు పెట్టుకోమని ఏ అమరుడు చెప్పాడని ప్రశ్నించారు.
గతంలో తెరాస ఎవరితో పొత్తు పెట్టుకున్నా అది రాష్ట్ర సాధన కోసమేనట, రాజకీయం కోసం కాదట! తెలంగాణకు అనుగుణంగా టీడీపీ మెడలు వంచింది కూడా తామేనని కేటీఆర్ చెప్పుకోవడం విశేషం! కాంగ్రెస్, టీడీపీలతో కేటీఆర్ పొత్తు పెట్టుకుంటే… దానికి ఒక పవిత్రతను ఆపాదించడం, అవే పార్టీలు ఇప్పుడు తెరాసకు వ్యతిరేకంగా ఇతర పార్టీలను కలుపుకుని మహా కూటమి కడుతుంటే దాన్ని అపవిత్ర బంధం అంటున్నారు కేటీఆర్! గతంలో తెరాస అజెండా ప్రకారం రాష్ట్ర ఏర్పాటుకే ఇతర పార్టీలతో వారు కలిసినప్పుడు, మహా కూటమి అజెండా ప్రకారం వీళ్లూ కలిశారనే అనుకోవచ్చు కదా! ఆ జెండాను ప్రజలు ఆదరిస్తారో లేదో అనేది తరువాతి విషయం. కానీ, పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదని చెబుతూనే, తాము పెట్టుకుంటే గొప్ప… ఇతరులు కలిస్తే తప్పు అన్నట్టుగా కేటీఆర్ విశ్లేషించే ప్రయత్నం చేయడం విశేషం. గమనించాల్సిన మరో విషయం… ఈ మధ్య కేటీఆర్ ఎక్కడ మాట్లాడినా తెలుగుదేశం పార్టీని కరుడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి అని పనిగట్టుకుని ప్రచారం చేస్తూ ఉండటం..!