మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో అగ్రస్థానంలో వెలుగొందుతున్న సమయంలో సినిమాలకు వీడ్కోలు చెప్పి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి విషయంలో మీడియా అండదండలు లేకపోవడం ఆయన రాజకీయ వైఫల్యానికి కారణం అయిందని ఆయన అభిమానులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. నిన్న జరిగిన వార్త విషయంలో, మరొకసారి చిరంజీవి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఇదే ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.
వివరాల్లోకి వెళితే, నిన్న తిరుపతిలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కలినరీ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక మంత్రి ఆల్ఫోన్స్, రాష్ట్ర పర్యాటక మంత్రి అఖిల ప్రియ తదితరులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి పాల్గొనడంతో మీడియా కూడా ఈ వార్తకు బాగానే కవరేజ్ ఇచ్చింది. పైగా ఇది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాం.
అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఇక్కడ కూడా మీడియా వాస్తవాలు దాచేసిందని చిరంజీవి అభిమానులు వాపోతున్నారు. ఈ ప్రాజెక్టు తిరుపతికి రావడానికి అప్పట్లో కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్న చిరంజీవి శతవిధాల ప్రయత్నించారు. ముందు ఈ ప్రాజెక్టు ఢిల్లీలో ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ భావించగా, చిరంజీవి వారిపై ఒత్తిడి తెచ్చి తిరుపతిలో ఏర్పాటు చేసేలా చేశారని 2014లో జాతీయ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. అయితే మీడియా ,ఇప్పుడు ఈ సంస్థ ఏర్పాటు పూర్తయిన సందర్భంగా అయినా, కనీసం చిరంజీవి పేరు ప్రస్తావించి ఉంటే బాగుండేదని చిరంజీవి అభిమానులు వ్యాఖ్యానిస్తూ ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. చిరంజీవి తిరుపతి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే.