కొండా సురేఖ దంపతులు.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌పై నేరుగా విమర్శలు ప్రారంభించారు. ఓడిపోతామనే భయంతోనే ముందస్తుకు వెళ్తున్నారని.. ఘాటుగా విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కరించలేని అసమర్థ ప్రభుత్వమని కొండా సురేఖ తేల్చి చెప్పారు. వరంగల్ ఈస్ట్ టిక్కెట్ విషయం పెండింగ్‌లో పెట్టడంతో తీవ్ర అసంతృప్తికి గురైన కొండా దంపతులు కొద్ది రోజుల కిందట ప్రెస్‌మీట్ పెట్టి… టీఆర్ఎస్ అధినాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. సమాధానం చెప్పాలంటే పన్నెండు ప్రశ్నలు సంధించారు. గణేష్ నవరాత్రుల సమయంలో.. కొండా దంపతులు.. సెంటిమెంట్ ప్రకారం ఇంటికే పరిమితమవుతారు. ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టరు. ఇప్పుడు నవరాత్రులు ముగియడంతో.. భవిష్యత్ బయటకు వచ్చారు.
గత ప్రెస్‌మీట్‌తో పోలిస్తే.. కొండా సురేఖ ఈ సారి నేరుగా కేసీఆర్‌పై గురి పెట్టారు. కేసీఆర్ ది తుగ్లక్ పాలన అని తేల్చేశారు. బీసీ మహిళ అయిన నాకు నమ్మకద్రోహం జరిగిందని మండిపడ్డారు. కేసీఆర్‌కు మంచినీళ్లు, టాబ్లెట్లు ఇచ్చే వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చారు…, నేను ప్రెస్‌మీట్ పెట్టి అడిగిన ప్రశ్నలకు 12 రోజులైనా సమాధానం లేదని మండిపడ్డారు. కేసీఆర్ కేబినెట్లో మహిళలకు స్థానం లేదన్నారు. ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ కు రాని ముఖ్యమంత్రి కేసీఆరేనని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికే ఎక్కుల పదవులు దక్కాయని, నాలుగేళ్ళలో కేసీఆర్ ప్రజాప్రతినిధులకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను సీఎంను చేయడానికే తాపత్రయ పడుతున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య… ఉద్రిక్త వాతావరణం పెంచేలా… కేసీఆర్ వ్యవహరించారన్నారు. చంద్రబాబుతో కావాలనే వ్యక్తిగత వైరం పెట్టుకున్నారని విమర్శించారు.
తమకు పదిహేను పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయన్న కొండా సురేఖ… నాలుగైదు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే.. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని.. ఆమె మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సోనియా, రాహుల్ గాంధీలను.. టీఆర్ఎస్ నేతలు విమర్శించడంపై ఆమె మండిపడ్డారు. నాలుగు గంటలు నిరీక్షిస్తే సోనియా, రాహుల్‌ను కలవొచ్చు…కానీ.. కేసీఆర్, కేటీఆర్‌లను మాత్రం కలవడం సాధ్యం కాదన్నారు. అలాగే మహాకూటమిపై కేటీఆర్ చేస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టారు. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకోవడాన్ని ప్రశ్నించారు. నియంత అయిన కేసీఆర్ ను ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయని.. మహాకూటమిని సమర్థించారు. కొండా దంపతుల మాటలు చూస్తే..నాలుగైదు రోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి.. మహాకూటమి తరపున పోటీ చేయడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.