పొలిటికల్ డ్రామాలెప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. దాన్ని డీల్ చేసే పద్ధతి తెలియాలంతే. సమకాలీన రాజకీయాల్ని సమర్థంగా తెరకెక్కించగలిగితే… పొలిటికల్‌డ్రామా పైసా వసూల్ సినిమాలా మారిపోతుంది. ఈమధ్య పొలిటికల్ డ్రామాలు ఎక్కువవుతున్నాయి. ఆ కోవలోనే వస్తున్న సినిమా `నోటా`. ట్రైలర్లు, పోస్టర్లు చూస్తే ఈ సినిమా మొత్తం రాజకీయాల చుట్టూనే తిరుగుతుందన్న విషయం అర్థమైపోతోంది. అయితే తమిళ ఫ్లేవర్ కాస్త ఎక్కువగా కనిపిస్తుండడంతో… అక్కడి పోలిటిక్స్ కి మాత్రమే ఈ కథ పరిమితమవుతుందని అనుకున్నారు.
కానీ చిత్ర రూపకర్తల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. దక్షిణాది రాజకీయాల ముఖచిత్రాన్ని నోటాలో ఆవిష్కరించేశారని టాక్. తమిళ రాజకీయాలే కాదు, ప్రస్తుతం నడుస్తున్న ఆంధ్ర, తెలంగాణ రాజకీయాల్ని కూడా ఈ సినిమాలో చూడొచ్చని సమాచారం. రాష్ట్రం విడిపోతున్నప్పటి పరిస్థితుల్ని, ఆ తరవాత జరిగే పరిణామాల్ని కూడా ఇందులో చూచాయిగా చూపించారని తెలుస్తోంది. అంతేకాదు.. కేసీఆర్, కేటీఆర్‌లను పోలిన పాత్రలు ఈ సినిమాలో చూడచ్చని, వాళ్లని సైతం పాజిటీవ్ యాంగిల్‌లోనే చూపించారని తెలుస్తోంది. జయలలిత ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. జయలలిత ఆసుపత్రిలోనే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. ఆ ఎపిసోడ్‌ని గుర్తు చేస్తూ.. కొన్ని డైలాగులు పేల్చారట. కర్నాటక, కేరళ రాజకీయాల్నీ ఇందులో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే… మరీ వివాదాస్పదం కాకుండా, ఎవరి పేరూ బయటకు తీసుకురాకుండా.. ప్రేక్షకులకు అర్థమై, అర్థం కాని రీతిలో సన్నివేశాల్ని నడిపించేశారని తెలుస్తోంది. అవన్నీ ఏ రేంజులో పండాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.