ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశరాజధాని డిల్లీలో ఉగ్రవాదులు విద్వంసం సృష్టించవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికల కారణంగా ఈసారి చాలా అసాధారణమయిన భద్రతా ఏర్పాట్లు చేసారు. సాధారణంగా దీని కోసం 15వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగించేవారు. కానీ ఈసారి పరిస్థితి తీవ్రత దృష్ట్యా 25వేల మందిని వినియోగిస్తున్నారు. వారిలో 5,000 మంది పారా మిలటరీకి చెందిన వారు. ఈసారి డిల్లీలో ట్రాఫిక్ పోలీసులకి కూడా ఆయుధాలు ఇచ్చేరు.
పరేడ్ జరుగబోయే రాజ్ పద్ వద్ద ప్రతీ 20 అడుగులకి ఒకరు చొప్పున మొత్తం 5,000 మంది పారా మిలటరీ సిబ్బందిని నియమించారు. మొత్తం 17 మంది డి.ఎస్పిలు, 42 మంది ఎసిపిలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిఘావర్గాల హెచ్చరికల నేపధ్యంలో డిల్లీలో పరేడ్ జరుగబోయే విజయ్ చౌక్ నుంచి రైసినా హిల్స్, సెంట్రల్ సెక్రెటరియెట్ భవనం పరిసర ప్రాంతాలలో మొత్తం 10,000 సిసి కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ఎర్రకోట నుంచి ఇండియా గేట్, తిలక్ మార్గ్, బహదూర్ షా జాఫర్ మార్గ్, నేతాజీ సుబాష్ చంద్రబోస్ మార్గ్ తదితర ప్రాంతాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. గత వారం రోజులుగా డిల్లీలో తిరుగుతున్న వాహనాలను అన్నిటినీ పోలీసులు క్షుణ్ణంగా తణికీలు చేస్తున్నారు.
ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హోలండీ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఆయనకు, ప్రధాని నరేంద్ర మోడికి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చుట్టూ ఏడంచల భద్రతావలయాలను ఏర్పాటు చేసారు. నేలమీదే కాకుండా గగనతలం నుండి కూడా గస్తీ నిర్వహిస్తున్నారు. అత్యాధునిక సమాచార వ్యవస్థ, కెమెరాలు, ఆయుధాలు గల వాయుసేనకు చెందిన ఆరు యుద్ద హెలికాఫ్టర్లు డిల్లీ గగనతలంలో పహారా కాస్తున్నాయి. ఈ రోజు ఉదయం 10.15 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు డిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు బయలుదేరవు. ఆ సమయంలో అక్కడ బయట నుండి విమానాలు దిగవు. రిపబ్లిక్ డే పెరేడ్ ముగిసే వరకు డిల్లీ గగనతలంలో విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్ లవంటి ఎగిరే అన్నితీపి నిషేధం విదించబడింది. నిషేధం ఉల్లంఘించి ఏదయినా డిల్లీ గగనతలంలోకి ప్రవేశిస్తే వాటిని పేల్చి వేయమని ఆదేశాలు జారీ అయ్యేయి.
ఎంతో ముచ్చటగా ఆనందంగా నిర్వహించుకోవలసిన గణతంత్ర దినోత్సవ వేడుకలని ఇంత కట్టుదిట్టమయిన భద్రత మధ్య భయం భయంగా నిర్వహించుకోవలసి రావడం చాలా బాధ కలిగిస్తుంది. కానీ నానాటికీ పెరిగిపోతున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచ దేశాలన్నిటిదీ కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి. భద్రత లేకుండా ఏ చిన్న కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. దానికి భారత్ మినహాయింపు కాదు కనుక ఇంత భద్రత తప్పనిసరి అవుతోంది.