వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త ఎమ్మెల్సీ కొండా మురళీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నిన్న హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన కొండా దంపతులు.. తమకు పదిహేను పార్టీల నుంచి ఆహ్వానం ఉందని చెప్పుకొచ్చారు. నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే హఠాత్తుగా ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారిని రాహుల్ వద్దకు తీసుకెళ్లారు.
ఒకప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడిగా ఉన్న కొండా మురళి.. ఆ తర్వాత ఆయనతో ఉప్పునిప్పులా వ్యవహరించి.. రాజకీయంగా ఎదిగారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో కొండా దంపతులకు ఎనలేని ప్రాధాన్యం లభించింది. వైఎస్ వారిని బాగా ప్రొత్సహించారు. కొండా మురళిపై తీవ్రమైన ఆరోపణలు ఉండటంతో ప్రత్యక్ష ఎన్నికల్లో కొండా సురేఖనే పోటీ చేస్తూ వస్తున్నారు. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్‌కో నడిచారు. తెలంగాణ ఉద్యమ సమయం తీవ్రంగా ఉన్న సమయంలోనూ వారు జగన్ వెంటే ఉన్నారు. జగన్ కోసం రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు. తెలంగాణ సెంటిమెంట్… చాలా ఎక్కువగా ఉన్నా.. జగన్ పార్టీ తరపున.. పరకాలలో దాదాపుగా గెలిచినంత పని చేశారు. చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జగన్‌తో విబేధాలొచ్చాయి. గత ఎన్నికలకు ముందు ఆమె టీడీపీలో చేరుదామనుకున్నారు. కానీ… ఎర్రబెల్లి దయాకర్ రావు అడ్డపడ్డారని… కొండా సురేఖనే స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందరికీ టిక్కెట్ ప్రకటించి.. తన టిక్కెట్‌ను పెండింగ్‌లో పెట్టడంతో.. కొండా సురేఖ మనస్థాపానికి గురయ్యారు. తాము హరీష్ వర్గం అవడం వల్లే పక్కన పెట్టారని ఆరోపిస్తూ.. తీవ్ర ఆరోపణలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పారు.