రేపే `నవాబ్` విడుదల. తమిళ నాట ఈ సినిమాకున్న క్రేజ్ తెలుగులో లేకుండా పోయింది. తమిళనాట గురువారం ఉదయం ఆటలకు టికెట్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. తెలుగులో మాత్రం పది శాతం క్రేజ్ కూడా లేదు. దీనికి కారణం… మణిరత్నం చేసిన చేస్తున్న పబ్లిసిటీనే. మణిరత్నంకి తెలుగునాటా వీరాభిమానులు ఉన్నారు. అంతెందుకు?? సినిమాని ప్రేమించిన వాళ్లంతా.. ఆయన్ని ఇష్టపడతారు. టాక్ ఎలా ఉన్నా… థియేటర్లో వాలిపోవాలని చూస్తారు. అయినా సరే, ఇక్కడున్న మార్కెట్ ని ఆయన పట్టించుకోవడం లేదు. `నవాబ్`కి సంబంధించి ఒక్క రోజంటే ఒక్కరోజు ప్రమోషన్లకు కేటాయించారు. అది కూడా తూతూ మంత్రంగానే సాగింది. తెరపై ఒక్క జయసుధ తప్ప… తెలుగుకు సంబంధించిన నటీనటులెవరూ కనిపించలేదు. ప్రకాష్ రాజ్ ఉన్నా.. ఆయనది కన్నడసీమ అని గుర్తించుకోవాలి. తెలుగులోనూ తమ సినిమాని మార్కెట్ చేసుకోవాలనుకున్నవాళ్లు కచ్చితంగా కొన్ని సూత్రాల్ని పాటించాల్సిన అవసరం ఉంది. తెలుగుకి సంబంధించిన నటీనటుల్ని ఎంపిక చేసుకోవడం, తెలుగులో ప్రచారం ముమ్మరంగా చేయడం అందులోని అంశాలే. కానీ మణి ఈ రెండు విషయాల్నీ పట్టించుకోలేదు.
పైగా సినిమా సినిమాకీ ఆయన తన బయ్యర్లను మార్చుకుంటూ వెళ్తున్నారు. అటు ప్రచారమూ లేక, ఇటు సినిమాపై నమ్మకమూ లేక… `నవాబ్` సినిమాని కొనడానికి ఎవరు ముందుకొస్తారు?? అయినా సరే,… మణి అదృష్టమో, మరోటో.. ఎవరో ఓ బయ్యర్ దొరుకుతూనే ఉన్నాడు. తాజాగా `నబాబ్`ని తెలుగులో రూ.3 కోట్లకు కొన్నారు. పబ్లిసిటీ ఈ రేంజులో ఉంటే… ఓపెనింగ్స్ ఎలా వస్తాయి? సినిమా ఫలితం అటూ ఇటూ అయితే… ఆ డబ్బులు కూడా వెనక్కి రావు. తెలుగులో తనకున్న అభిమానుల గురించి కాకపోయినా.. తన సినిమాని కొన్న బయ్యర్ల గురించైనా మణిరత్నం ఓసారి ఆలోచించుకుంటే బాగుంటుంది.