ఒకప్పటి రెహమాన్ వేరు, ఇప్పటి రెహమాన్వేరు. ఓ ఆల్బమ్ చేశాడంటే అన్ని పాటలూ సూపర్ హిట్టయ్యేవి. ఇప్పుడు మాత్రం.. హిట్ పాటలు ఎక్కడ దొరుకుతాయా అని ఏరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెహమాన్ నుంచి ఓ గొప్ప పాట విని చాలా కాలమైంది. పైగా రొటీన్ ట్యూన్లతో విసిగిస్తున్నాడు. రెహమాన్ పాటలు… పాత బాణీలనే గుర్తు చేస్తున్నాయి. మీ పాటలు మరీ రొటీన్ అయిపోతున్నాయేంటి? అని అడిగితే.. తెలివిగా సమాధానం చెప్పాడు రెహమాన్. ”బాణీ అనేది నా పర్సనాలిటీ. నేను మారనప్పుడు బాణీ ఎలా మారుతుంది. నా వ్యక్తిత్వమే నా బాణీలు.. నేను ఎలా మారనో అవీ అలానే మారవు” అంటున్నాడు. తన పాటలపై వస్తున్న విమర్శలకు పెద్దగా స్పందించనని, పాట రాసేవాళ్లకి, పాడే వాళ్లకీ, ఆ పాటని తీసుకునే దర్శకుడికీ పాట నచ్చుతుందా? లేదా? అనేది గమనిస్తానని, ఓ ప్రేక్షకుడి స్థానంలో కూర్చుని ట్యూను సిద్ధం చేస్తానని చెప్పుకొచ్చాడు రెహమాన్. మణిరత్నం తాజా చిత్రం `నవాబ్`కి ఆయనేసంగీత దర్శకుడు. మణిరత్నం స్టైల్ గురించి చెబుతూ ”మాది ఇరవై ఆరేళ్ల ప్రయాణం. ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకం, ప్రేమ, గౌరవం వల్లే ఇది సాధ్యమయ్యాయి. ఆయనతో నా ప్రయాణాన్ని చాలా ఆస్వాదిస్తా. నాతో ప్రయాణించడం ఆయనకు ఇష్టం. నేనేమైనా సలహాలు ఇస్తే తీసుకుంటారు. ఓ గొప్ప పాట రావడానికి తనవంతుగా ఇన్పుట్స్ ఇస్తారు. అదే మా విజయాలకు కారణం” అన్నాడు రెహమాన్.