హీరోల్ని, హీరోయిన్లనీ గాయకులుగా మార్చేయడమంటే దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి సంగీత దర్శకులకు భలే సరదా. హీరో ఓ పాట పాడాడంటే… ఆల్బమ్‌కి కొత్త క్రేజ్ వస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోరు వీరిద్దరూ. తాజాగా రామ్‌ని సైతం గాయకుడిగా మార్చేశాడు దేవిశ్రీ ప్రసాద్. రామ్కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. దీనికి దేవి సంగీ దర్శకుడు. ఈ సినిమాలోని ఓ గీతాన్ని రామ్, ప్రకాష్ రాజ్‌లపై తెరకెక్కించాల్సివచ్చింది. ఆ ఇద్దరి చేతే పాట పాడించేస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచించాడు దేవి. దానికి రామ్, ప్రకాష్‌రాజ్ ఓకే అనేశారు. దాంతో వారిద్దరూ కలసి ఓ పాట పాడేశారు. ‘ఫ్రెండు ఫ్రెండు… కొంచెం మార్చు ట్రెండు’ అంటూ సాగే ఈ పాటని గీత రచయిత చంద్రబోస్ రాశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ పాటని తెరకెక్కిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 18న విడుదల కానుంది.