దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు శిష్యుడుగా తన కెరీర్‌ని స్టార్ట్ చేసిన ఎస్.ఎస్.రాజమౌళిని ఇప్పుడు గురువును మించిన శిష్యుడు అని ప్రపంచ వ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి తన మొదటి చిత్రం ‘స్టూడెంట్ నెం.1’ని రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలోనే చేశాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమా, సినిమాకీ దర్శకుడుగా పరిణతి చెందుతూ ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఇప్పటివరకు రాజమౌళి చేసిన ఏ సినిమాలోనూ రాఘవేంద్రరావు స్టైల్ కనిపించదు. తనకంటూ ఓ స్పెషాలిటీని ఏర్పరచుకొని ఆడియన్స్ పల్స్ ఎలా వుందో గ్రహించి ఆవిధంగా సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు. అతను చేసింది తక్కువ సినిమాలే అయినా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గుర్తించి అతనికి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. రాజమౌళితో పోలిస్తే రాఘవేంద్రరావు చేసిన సినిమాల సంఖ్య అతని దరిదాపుల్లో కూడా లేదు. 108 సినిమాలు డైరెక్ట్ చేసిన రాఘవేంద్రరావు ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున ఎలాంటి పురస్కారం అందుకోలేదు. ఉత్తమ దర్శకుడుగా పలుమార్లు నంది అవార్డులు అందుకున్న రాఘవేంద్రరావు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎన్టిఆర్ నేషనల్ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు.. ఇలా ఏదీ రాఘవేంద్రరావుని వరించలేదు. 1975లో డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రాఘవేంద్రరావు 40 సంవత్సరాలుగా డైరెక్టర్‌గా కొనసాగుతూ కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా అన్నమయ్య, శ్రీమంజునాథ, శ్రీరామదాసు, శిరిడీసాయి వంటి భక్తిరస చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించి తెలుగు ప్రజల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తిన రాఘవేంద్రరావుకి ఎలాంటి ప్రభుత్వ పురస్కారాలు లభించక పోవడం వెనుక కారణం ఏమై వుంటుంది?
2001లో డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 15 సంవత్సరాల్లో కేవలం 11 సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేసిన రాజమౌళికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ 15 సంవత్సరాల్లో రాజమౌళి అందుకున్న అవార్డులు లెక్కకు మించి వున్నాయి. అంతేకాకుండా రాజమౌళి చేసిన సినిమాలను చాలా భాషల్లో రీమేక్ చేశారు, కొన్ని డబ్ చేశారు. ఇలా అన్ని భారతీయ భాషల్లో రీమేక్ లేదా డబ్ అయిన సినిమాలు చేసిన డైరెక్టర్ తెలుగులో ఇప్పటివరకు లేరనే చెప్పాలి.
40 సంవత్సరాల కెరీర్లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు, ఎన్నో కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్‌ని రూపొందించిన రాఘవేంద్రరావుకి పైన చెప్పుకున్న ఏ గౌరవమూ దక్కలేదు. టేకింగ్ పరంగా, హిట్స్పరంగా, కలెక్షన్లపరంగా, పేరు ప్రఖ్యాతుల పరంగా గురువును మించిన శిష్యుడు అనిపించుకున్న రాజమౌళి ఇప్పుడు పద్మశ్రీ అవార్డును కూడా సాధించి అన్నివిధాలుగా గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు.