జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రజాపోరాట యాత్ర పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఇవాళ దెందులూరు లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ సభకు అభిమానులు భారీగా వచ్చారు. ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ పదునైన వ్యాఖ్యలతో ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మీద చంద్రబాబు మీద ,లోకేష్ మీద పదునైన అస్త్రాలు ఎక్కుపెట్టాడు పవన్ కళ్యాణ్.
2014లో తెలుగుదేశం పార్టీకి తాను మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేస్తూ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బలమైన అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని, సామాజిక ఆర్థిక ప్రగతి ఉంటుందని తాను భావించానని అందుకే ఆరోజు మద్దతు పలికారని చెప్పుకొచ్చారు. కానీ తన అంచనాలు తలకిందులయ్యాయి అని పేర్కొన్నారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి మాట్లాడుతూ, ఈయన భూములను ఆక్రమించుకున్నారు అని, ప్రజలపై దాడి చేశారని, సాక్షాత్తూ ప్రభుత్వ అధికారి పై మహిళ అని కూడా చూడకుండా దాడి చేశారని, ఒక ఎస్సై ని సైతం కొట్టాడని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో దూషించాడని, ముసలి ముతకా అని కూడా చూడకుండా వృద్ధులను కూడా కింద పడేసి మరీ కొట్టాడని, ఆడపడుచులపై బూతులతో దాడి చేస్తున్నాడని, వికలాంగులపై కూడా దాడి చేస్తున్నాడని, ఇలాంటి ఆకు రౌడీ ని, వీధి రౌడీ ని చంద్రబాబు చీఫ్ విప్‌గా కూడా నియమించారు అని అటు చంద్రబాబు ఇటు చింతమనేని కలిపి విమర్శనాస్త్రాలు సంధించాడు పవన్ కళ్యాణ్.
ఇక చంద్రబాబు పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ, చంద్రబాబు చింతమనేని ని చీఫ్ విప్‌గా నియమించారని, ఆ పదవిలో ఉన్న వ్యక్తి శాసనసభలో ఎమ్మెల్యేలు క్రమశిక్షణ పాటించేలా చూడాల్సి ఉంటుందని, కానీ ఆయనకే క్రమశిక్షణ లేకపోతే ఇక ఎమ్మెల్యేలను క్రమశిక్షణ పాటించేలా చేస్తాడని చింతమనేని ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
ఇక చింతమనేని పై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వారి కుమారుడు లోకేష్ గారికి, చింతమనేని ప్రభాకర్ అంటే భయం అని అందుకే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని చెబుతూ, తమ పార్టీ ఎమ్మెల్యే నే క్రమశిక్షణలో పెట్టలేని చంద్రబాబు సింగపూర్ తరహా పాలన ఎలా చేస్తాడు అని ప్రశ్నించాడు. చింతమనేని పై 27 కేసులు ఉన్నాయని, ఆయన అన్ని అరాచకాలు చేస్తూ, దాడులు చేస్తూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలు చిన్న బైక్ ర్యాలీ చేస్తేనే కేసులు పెడుతున్న పోలీసులు, ప్రభుత్వం, చింతమనేని ఇన్ని అరాచకాలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే, ప్రజలే చర్యకు పూనుకుంటారని హెచ్చరించారు. తెలంగాణలో గడీల పాలన ఒకప్పుడు ఉండేదని, కానీ ఆ అరాచకాన్ని సహించలేక ప్రజలే దానికి చరమగీతం పాడారని గుర్తు చేశారు. అలాగే ముస్సోలినీ, గడాఫీ లాంటి నియంతలు దేశాధినేతలు అయినప్పటికీ, వారి అరాచకాలు శృతిమించినప్పుడు ప్రజలే వారికి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు.
మొత్తం మీద, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం అని, తదుపరి సభలో జనసేన మేనిఫెస్టో గురించి వివరిస్తానని ప్రకటించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే నిన్నటి నుంచి జరుగుతున్న సవాళ్లు ప్రతిసవాళ్లు మధ్య సభ ఎలా జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూసిన వారికి సభ సజావుగా జరగడం సంతృప్తినిచ్చింది.