టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి రెండోసారి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పెద్దలను ఉద్దేశించి, పార్టీని ఉద్దేశించి ఆయన ఓ మీటింగ్ లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే, రెండో నోటీసుపై ఇంతవరకూ తమకు ఎలాంటి వివరణా రాలేదని క్రమశిక్షణా కమిటీ అంటోంది. అంతేకాదు, తన అభిప్రాయాన్ని రాజగోపాల్ రెడ్డి నేరుగా వచ్చి చెప్పాల్సి ఉంటుందని కూడా కమిటీ స్పష్టం చేసింది. ఆయన రాకకోసం కొద్దిరోజులు వేచి చూస్తామనీ, ఆ తరువాత రాజగోపాల్ వ్యవహారంపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కమిటీ స్పష్టంగా ప్రకటించింది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన క్రమశిక్షణా కమిటీ ముందు హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, వరంగల్ లో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి తీరు మరోలా ఉంది! తాను ఆవేశంగా మాట్లాడిన మాటలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. పార్టీకి నష్టం చెయ్యాలని తాను అలా అనలేదనీ, బాధతో చెప్పిన మాటలుగా వాటిని చూడాలన్నారు. కాబట్టి, దాన్నే పట్టుకుని రెండో షో కాజ్ నోటీస్ ఇచ్చినా, మూడో షోకాజ్ నోటీస్ ఇచ్చినా… తన సమాధానం అదేనని స్పష్టం చేశారు. మళ్లీ మళ్లీ షోకాజ్ నోటీసులు ఇచ్చినా దానికి అర్థం లేదనీ, వాటికి తాను జవాబు ఇచ్చినా కూడా అదీ అర్థంలేనితనమే అవుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం! కాబట్టి, తన తాజా వ్యాఖ్యల్నే జవాబుగా తీసుకోవాలనీ, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. టీడీపీతో పొత్తుపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, వాళ్లెక్కడ గెలుస్తారో అక్కడ కొన్ని సీట్లు ఇవ్వొచ్చన్నారు. కేసీఆర్ వ్యతిరేక పవనాలు బలంగా ఉన్నాయని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని, గెలిచేవారికే పార్టీలో టిక్కెట్లు ఇవ్వాలన్నారు.
మునుగోడు నియోజక వర్గం నుంచి ప్రజలు తనని పోటీ చేయాలని అభిమానంతో కోరుతున్నారన్నారు. తనకు మరో మూడేళ్లపాటు ఎమ్మెల్సీ పదవి ఉందనీ, అయినాసరే మీరే నిలబడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు! కాబట్టి, మునుగోడు టిక్కెట్ ను పార్టీ తనకు తప్పకుండా ఇస్తుందన్న నమ్మకం ఉందని రాజగోపాల్ రెడ్డి చెప్పడం విశేషం. మొత్తానికి, రెండో షో కాజ్ నోటీసుకు ఆయన ప్రత్యేకంగా సమాధానం ఇచ్చేది లేదని స్పష్టంగానే చెప్పేశారు అనుకోవచ్చు. ఇంకోపక్క, ఆయన స్వయంగా హాజరు కావాల్సిందే అంటూ క్రమశిక్షణా కమిటీ పట్టుబడుతోంది. ఎవరి పంతంతో వారున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.