జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాపోరాటయాత్ర… రెండో విడత ప్రారంభంలోనే… వ్యక్తిగత పోరాటలకు దిగిపోయారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై.. ఆయన యుద్ధం ప్రకటించారు. ఆయన పర్యటనకు ముందు నుంచి… చింతమనేనిపై విమర్శలు ప్రారంభించారు. దానికి చింతమేనేని కౌంటర్ కూడా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ దెందులూరులో సభ పెట్టి… గంట సేపు ప్రసంగించి.. పూర్తిగా చింతమనేనిని టార్గెట్ చేశారు. ఫ్యాన్స్‌తో కొట్టిస్తా అని కూడా అన్నారు. తాను చింతమనేని లాంటి గాలి రౌడీలు, ఆకు రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని ప్రకటించుకున్నారు. కానీ చింతమనేని ఎప్పుడూ.. పవన్ కల్యాణ్‌ను తేల్చుకుందాం.. రా అని సవాల్ చేయలేదు. రాజకీయ విమర్శలు చేసి ఉంటారేమో..?. తాను 16 ఏళ్ల వయస్సులో ఇటువంటి ఆకు రౌడీలు, గాలి రౌడీలను తన్ని తరిమేసానని, 19 ఏళ్లవయస్సులో సాయుధపోరాటానికి సిద్దం అయిన వ్యక్తినని తనకు సినిమాల్లో రాక ముందే హీరోయిజం ఉందని.. చెప్పుకున్నారు.
కానీ అందరికీ అర్థం కాని విషయం… చింతమనేని కోసం.. పవన్ కల్యాణ్ గంట సేపు ప్రసంగం చేయడం. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. ముఖ్యమంత్రి అవుతానని అంటున్న పవన్ కల్యాణ్ ఓ నియోజకవర్గ స్థాయి నేతపై అంత ఆవేశ పడటం ఎందుకన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. పవన్ కల్యాణ్ తన స్థాయిని అక్కడికే ఊహించుకున్నారా లేక… చింతమనేనిది తన స్థాయి అని అంచనా వేసుకున్నారో జనసైనికులకు కూడా అర్థం కాలేదు. పవన్ కల్యాణ్ ప్రసంగం వింటే.. చింతమనేని కంటే.. తానే పెద్ద రౌడీని అని చెప్పుకోవాలన్నట్లుగా.. ఉంది. చింతమనేని కూడా.. చాలా సార్లు రాజకీయ ప్రసంగాలు చేసి ఉంటారు కానీ.. ఇలా మాటలతో … చెలరేగిన సందర్భం ఉండదు. తాను ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ… మంత్రిగా ఉన్న వట్టి వసంత్ కుమార్ లాంటి వాళ్లు ప్రొటోకాల్ పాటించలేదని… చొక్కాపట్టుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ.. దూరంగా తొడకొట్టి వెళ్లిపోయిన సందర్భాలు లేవు.
చింతమనేని ప్రభాకర్ కచ్చితంగా ఆవేశ పరుడే. ఎవరైనా తప్పు చేశారని అనిపిస్తే…ఆయన చట్టాల దాకా వెళ్లరు. తనే చేయి చేసుకుంటారు. అయితే ఆ దూకుడు ఆయన… స్వార్థ ప్రయోజనాల కోసం.. తన కోసం చేస్తారని.. దెందులూరు ప్రజలు కూడా అనుకోరు. సమస్యను పరిష్కరించమని తన దగ్గరకు వచ్చిన వారి కోసమే ఆయన దుందుడుకు తనం ప్రదర్శిస్తారు. తనపై కేసులు నమోదైనా… కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చినా ఆయన వెనుకాడరు. ఆయన చేసింది తప్పయితే.. కచ్చితంగా ప్రజలు ఓడిస్తారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ అచ్చమైన కొత్త తరం రాజకీయ నేతగా వ్యవహరించాల్సింది. చింతమనేని చేసే దౌర్జన్యాలను వివరించి… ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునివ్వాల్సింది. కానీ… దెందులూరు నడిబొడ్డున నిలబడి.. చింతమనేనిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి… ఖబడ్దార్ అనే వెళ్లిపోతే… అది కొత్త రాజకీయమా..? అవగాహన లేని.. బుర్ర వికసించని రాజకీయమా..?
—- సుభాష్