ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 1.30 లక్షల కోట్లు అప్పులు తెచ్చారనీ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అమరావతి నిర్మాణం కోసం అన్ని వర్గాల ప్రజల నుంచి వసూలు చేసిన విరాళాలు ఏమయ్యాయి అంటూ నెల్లూరులో జరిగిన ఓ సమావేశంలో ప్రశ్నించారు. ప్రభుత్వ ధనం నాయకుల జేబుల్లోకి వెళ్లిపోయిందనీ, అందుకే పాలన అంతా అవినీతిమయంగా మారిపోయిందని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై తాము పోరాటం చేస్తామన్నారు. దీన్లో భాగంగా వచ్చే నెలలో మూడు మెగా ధర్నాలు చేపట్టబోతున్నట్టు కన్నా ప్రకటించారు. అక్టోబర్ 6న ఏలూరులో, అనంతపురంలో 15న, విశాఖపట్నంలో 25న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కన్నా చెప్పారు.
అధికార పార్టీ అవినీతిపై పోరాటం అంటూ రాష్ట్రస్థాయిలో ధర్నాలకు మాత్రమే పరిమితం కావాల్సిన అవసరం భాజపాకి ఏమొచ్చింది..? కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అవినీతిపై ఏకంగా ఏదో ఒక కేంద్ర సంస్థతో విచారణ జరిపించే ప్రయత్నం రాష్ట్ర భాజపా నేతలు ఎందుకు చెయ్యరనేది ఎప్పటికీ ప్రశ్నే..? ఇక, నిధుల మీద కన్నా వ్యాఖ్యల విషయానికొస్తే… అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇచ్చిందా..? ఇంతవరకూ విదిల్చింది కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే. మరో రూ. 2,500 కోట్లు త్వరలో ఇస్తామంటూ ఈ మధ్యనే కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఆ త్వరలో అంటే ఎప్పుడూ అనే స్పష్టత కేంద్రం నుంచి ఎప్పుడూ ఉండదు.
ఒకవేళ అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు సరిపడా ఇచ్చి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం బాండ్లు ఎందుకు జారీ చేయాల్సి వస్తుంది..? నిధుల సేకరణకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సిన అవసరం రాష్ట్రానికి ఏముంటుంది..? ఇదొక్కటేకాదు.. వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల మాటేంటి..? రెవెన్యూలోటు భర్తీ చేస్తామంటూ, చేయాల్సింది తక్కువే అంటూ కేంద్రం చెబుతున్న లెక్కల గారిడీ మాటేంటి..? ఇవేవీ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడరు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేస్తోందని ఆవేదన చెందుతారు! కేంద్రం బాధ్యతల్ని విస్మరించి ఇవ్వాల్సిన నిధులే ఇవ్వకపోతే రాష్ట్రం ఏం చేస్తుంది..? ఏదేమైనా, ఏపీ భాజపా నేతలు వినిపిస్తున్నది పసలేని వాదన. ముందుగా కేంద్రం చేసిన పనుల గురించి మాట్లాడి, ఆ తరువాత రాష్ట్ర సర్కారుపై వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షిస్తారు.