వివాహేతర శారరీక సంబంధాలు పెట్టుకున్న ఇద్దరికీ ఆమోదయోగ్యమైతే.. అది ఏ మాత్రం నేరం కాబోదని.. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. ఇప్పటి వరకూ ఇలాంటి సెక్షన్ 497 ప్రకారం.. వివాహేతర సంబంధాలు నేరం. అయితే.. ఇలాంటి కేసుల్లో ఆడవారిపై ఎలాంటి కేసులు ఉండవు. ఆమె అసలు నేరస్తురాలే కాబోదు. పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి మాత్రం సెక్షన్ 497 ప్రకారం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక ఈ రెండూ గానీ ఉంటాయి. ఇప్పుడీ సెక్షన్ రాజ్యాంగ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తేల్చి వేసింది.
వివాహేతర సంబంధాను నేరంగా పేర్కొనే సెక్షన్ 497 ఒక పురాతన చట్టమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. సెక్షన్ 497తోపాటు సెక్షన్ 198 కూడా రాజ్యాంగ సమ్మతం కాదని వెల్లడించింది. సెక్షన్ 497 మహిళల సమాన అవకాశాలను కాలరాస్తోందని, సమానత్వ హక్కులను తూట్లు పొడిచేలా ఇది ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. మహిళలను సమానులుగా చూడని ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధమేనని, వివాహేతర సంబంధాల్లో పురుషులను మాత్రమే బాధ్యులను చేసే సెక్షన్ 497 సరికాదని, మహిళలకు కూడా సమాన హక్కులు ఉంటాయని పేర్కొంది. వివాహేతర సంబంధాల విషయంలో వివాహితలను మినహాయించి.. పెళ్లయిన పురుషుడిని మాత్రమే శిక్షించే సెక్షన్ 497ను రద్దు చేయాలంటూ జోసెఫ్ షైనీ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశాడు.
వైవాహిక జీవితంలో అసంతృప్తికి వివాహేతర సంబంధాలు కారణం కాదని, వైవాహిక జీవితంలో అసంతృప్తి వల్లే ఇలాంటి సంబంధాలు తలెత్తుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం మతానికి, జాతికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమే అయినప్పుడు 497 సెక్షన్ కూడా ఆ ఆర్టికల్‌కు లోబడే ఉండాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు సెక్షన్ 497ను కొనసాగించాల్సిన అవసరముందన్న కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. కానీ ధర్మానసం అంగీకరించ లేదు.