కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో… టీడీపీ కి పది నుంచి పధ్నాలుగు, సీపీఐ, టీజేఎస్‌కు మూడేసి సీట్లు ఇవ్వాలని… ప్రాథమికంగా అనుకుంది. మిగతా పార్టీల సంగతేమిటో కానీ…కోదండారం మాత్రం..ఈ ప్రతిపాదనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలంటే అందరితో కలసి వెళ్ళాలని కోదండరాం భావించారు. మహాకూటమి ఏర్పాటు కూడా ఇందులో భాగమే. కూటమికి నాయకత్వం వహించాలని కోదండరాం భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు పూర్తిగా తేడాగా ఉంది. జేఏసీ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి, తెలంగాణ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన నాయకుడిగా ఆయనకు పెద్ద పీట వేయడం లేదు. మూడు సీట్లు మాత్రమే ఇస్తామంటున్నారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో కోదండరాం కీలకపాత్ర పోషించాలనుకుంటున్నారు. అయితే కూటమిలో మైనారిటీ నేతగా ఉంటే ఆయన కల సాధ్యంకాదు. కాంగ్రెస్ ఆయనకు ఆఫర్ చేస్తున్నది కేవలం మూడంటే మూడుసీట్లే. తెలంగాణలో తెలంగాణ జనసమితి మూడు నాలుగు సీట్లకు కుదించుకు పోవటం కోదండరాంకు ఏమాత్రం ఇష్టం లేదని టీజేఎస్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో మూడు సీట్ల కోసం ఆత్మవంచన చేసుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శలు ప్రారంభించారు. కాంగ్రెస్ ఆఫర్ చేస్తున్న సీట్లతో ఆయన ఏమాత్రం సంతృప్తిగా లేరు. కానీ ఈ సమయంలో కూటమి నుంచి పక్కకు వెళ్లిపోతే అది టీఆర్ఎస్ కు లాభిస్తోంది. కేసీఆర్ ను ఓడించాలన్న తన ఆశయం నెరవేరాలంటే.. తనొక్కడితో సాధ్యం కాదు. కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడుతోన్న మహాకూటమిలో కలవాల్సిన పరిస్థితి. అయితే కలిస్తే ఒక సమస్య.. కలవకపోతే మరో సమస్యగా కోదండరాం పరిస్థితి తయారైంది.
కూటమిలో సీపీఐ 8 స్థానాల్లో పోటీ చేస్తామని చాడ వెంకటరెడ్డి చెప్తున్నారు. టీడీపీ కూటమిలో 25 స్థానాలు అడుగుతోంది. జనసమితి.. కనీసం 35స్థానాలకు పోటీ చేయాలనుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ తేడాగా ఉంది. కూటమిలో సర్థుకుపోదామనుకున్నా.. రాబోయే ప్రభుత్వం తన ఆశయాలకు అనుగుణం నడుస్తోన్న గ్యారంటీ లేదు. అందుచేత మహాకూటమికి కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించాలనీ.. కూటమిలో చేరుతున్నందుకు పరిహారంగా కామన్ మినిమం ప్రోగ్రాం తయారు చేసే ఛైర్మన్ గా అయినా ఉందామని కోదండరాం ఆశించారు. కానీకాంగ్రెస్ దీనిపై ఏ విషయమూ చెప్పడం లేదు. అందుకే కోదండరాం ఏం నిర్ణయం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు.