కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేశారు. సోదాలు నిర్వహించారు. చట్టలను ఉల్లంఘించిన ప్రతి రాజకీయ నాయకుడిపై చట్ట ప్రకారం తీసుకోవాల్సిందే. ఈ విషయంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మినహాయింపు కాదు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన మినహాయింపు కాదు. రేవంత్ రెడ్డి.. దోషినా కాదా… అన్నది.. న్యాయస్థానాలు నిర్ణయించక ముందు విశ్లేషకులు నిర్ణయించడం సరైనది కాదు. దాడులు చేసినవి రాజ్యాంగ సంస్థలు. ఆధారాలు సేకరించి.. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే.. న్యాయస్థానాలు అవి సమంజసమైనవని భావిస్తే శిక్షలు వేస్తాయి. నిజంగా రేవంత్ రెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టి ఉంటే..శిక్ష పడాల్సిందే.
కొంత మందిపైనే ప్రత్యేకంగా ఎందుకు ఐటీ దాడులు..?
రేవంత్ రెడ్డి పై ఐటీ, ఈడీ దాడులు జరగడంపై.. రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య ప్రజల్లోనూ అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి..?. దాడులు సెలక్టివ్‌గా జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే… ఇవి జరిగాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం కేసులు లేవు. కానీ ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసులు వచ్చాయి. జైలుకు కూడా వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్లీ జైలు వైపు వెళ్లాల్సిన అవసరం కూడా రాలేదు. కేసులు ముందుకు పోవడం లేదు. అందుకే..సెలక్టివ్‌గా.. సీబీఐ, ఈటీ దాడులు, చర్యలు తీసుకుంటున్నాయి. అందుకే అందరూ అనుమానించాల్సి వస్తుంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైనా ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే ఈ దాడులు జరిగాయి. ఆ దాడుల్లో ఏం దొరికాయన్న విషయం ఎవరికీ తెలియదు. ఐటీ అధికారులు చెప్పలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా… పార్టీ మారకుండా టీఆర్ఎస్‌లోనే ఉండిపోయారు. ఇలా అనేక అంశాలు ఇమిడి ఉన్నాయా..?
రేవంత్‌పై ఇప్పుడే ఐటీకి సమాచారం అందిందా..?
రేవంత్ రెడ్డిపై ఇప్పుడే ఎందుకు దాడులు చేశారు. ఎన్నికల ముందే ఎందుకు రేవంత్ ను టార్గెట్ చేశారు. రేవంత్ .. ఈ రెండు మూడు రోజుల కిందటే అక్రమాస్తులు సంపాదించాడా..? లేక ఇప్పుడే సమాచారం వచ్చిందా..? ఆయనపై ఎప్పటి నుంచో కేసులు ఉన్నాయంటున్నారు. ఎప్పట్నుంచో కేసులు ఉంటే.. ఇప్పుడే ఎందుకు సోదాలు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ టీవీ కెమెరాల ముందు కనిపించారు. చంద్రబాబునాయుడు వాయిస్ కూడా ఉంది. అప్పుడు కేసీఆర్ చంద్రబాబును భగవంతుడు కూడా రక్షించలేడన్నారు. మరి ఇంత కాలం ఎవరు రక్షించారు..?. చంద్రబాబుపైన ఏమీ లేదు.. ఆ మాట కొస్తే.. రేవంత్ రెడ్డిపైనా ఏమీ లేదు. ఆ కేసు ఏమైంది..? . ఇక్కడ మతలబ్ ఏమిటి..?
నయీం నుంచి ఎంసెట్ లీకేజీ వరకూ కేసులు ఏమయ్యాయి..?
నయీంతో అన్ని పార్టీలక నేతలకు సంబంధాలున్నాయని వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ నేతలకూ ఉన్నాయని చెప్పుకొచ్చారు. కానీ… ఆ కేసు ఏమైంది..? రాజకీయ నాయకులతో సంబంధాలు లేకుండానే… వ్యవహారాలు నడిపారని నమ్ముదామా..? ఓ రాజకీయ నాయకుడికి కానీ.. ఓ పోలీసు అధికారికి కానీ శిక్ష పడిందా..?. నయీం మిధ్య.. నేరాలు మిథ్య అని నమ్ముదామా..? మియాపూర్ ల్యాండ్ స్కాం ఏం జరిగింది..?. పేర్లు కూడా బయటకు వచ్చాయి. వారంతా ఎక్కడికిపోయారు. ఈ కేసులన్నీ.. గప్ చుప్.. విచారణలు కూడా ఎక్కడా లేవు. ఎంసెట్ లీక్ కేసు ఏమైంది..? ఇందులోనూ రాజకీయ నేతల ప్రమేయం ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఇంత వరకూ కేసులో పురోగతి లేదు. అంతకు ముందు మద్యం కుంభకోణం.. వోక్స్ వ్యాగన్ స్కాం.. వశిష్టవాహన్ కేసు ఉంది.. అవన్నీ ఏమయ్యాయి..? ఇలాంటి కేసులు వస్తున్నాయి.. పోతున్నాయి. అధికారానికి దగ్గరగా ఉన్న వారు బయట పడుతున్నారు. అధికారాన్ని ధిక్కరించేవారు కేసుల పాలవుతున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయని కనుకనే అనుమానాలొస్తున్నాయి.
ప్రతిపక్ష పార్టీల నేతలపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి..?
రేవంత్ రెడ్డి… అక్రమాస్తులు సంపాదించి ఉంటే కచ్చితంగా శిక్షార్హుడే. ఆయనపై సోదాలు చేయడాన్ని తప్పు పట్టడం లేదు. రేవంత్ నేరం చేశాడా.. లేదా.. అన్నది దర్యాప్తు సంస్థలు నిర్ణయిస్తాయి. కానీ ఫండమెండల్ పాయింట్ ఏమిటంటే.. రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్‌లో కానీ.. బీజేపీలోకానీ ఉంటే జరిగేవా..? . టీఆర్ఎస్, బీజేపీలో ఏ నాయకుడికి కూడా.. ఆదాయానికి మించిన ఆస్తులు లేవని నమ్ముదామా..? ఒక్క తెంలగాణలో కానీ.. ఈ దేశంలో ఏ పార్టీకి చెందిన నేతలైనా.. ఒక్కరు కూడా.. ఆదాయానికి మించిన ఆస్తులు లేవా..? ఒక్క రేవంత్ రెడ్డికే ఉన్నాయా..? వారందరిపైనా.. ఎందుకు సోదాలు జరగడం లేదు. వారిపై ఎందుకు కేసులు రావడం లేదు. అలాంటప్పుడు… ప్రతిపక్ష పార్టీల నేతలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల తర్వాత డీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చని వార్తలు వచ్చిన తర్వాత టూజీ కేసులో ఎవరూ తప్పు చేయలేదని తేలిపోయింది. కానీ లాలూ యాదవ్ దోషి అంటారు. అరవింద్ కేజ్రీవాల్ పై కేసులుంటాయి. మిగతా వారి మీద ఉండవు.
అవినీతికి పాల్పడిన నేతలందరిపైనా చర్యలు తీసుకోలేరా..?
దేశంలోనూ.. రాష్ట్రంలోనూ.. జరుగుతున్నటువంటి.. రాజ్యంగసంస్థల దాడులు… కొన్ని సెలక్టివ్‌గా రాజకీయ లక్ష్యాలను బట్టి ఉంటున్నాయి. కొన్ని కేసుల్లో సోదాలు.. హాడావుడి… అనుమానాలు కలిగింపచేస్తాయి. అల్టిమేట్ గా రాజీకయ ప్రయోజనాల కొరకు.. రాజ్యాంగసంస్థలను ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ అవినీతికి కానీ.. ఇతర అవినీతికి పాల్పడి ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టుకున్న వారిని కచ్చితంగా శిక్షించాల్సిందే. అయితే అది పార్టీలకు అతీతంగా జరగాలి. రాజకీయ పక్ష పాతాన్ని చూపకుండా.. దర్యాప్తు సంస్థలు అన్ని పార్టీల్లో ఉన్న నేతల అవినీతిపై విచారణ చేయాలి. అలా కాకుండా.. ప్రతిపక్ష పార్టీల్లోని నేతలను మాత్రమే టార్గెట్ చేసినంత కాలం ప్రజలు.. దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వం వైపు అనుమానంగానే చూస్తూ ఉంటారు.