నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. అధినేతలను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు బల ప్రదర్శనలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ముందే ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే చాన్సిచ్చారు. ఈ సిట్టింగ్ లను ఢీకొనేందుకు ఇతర రాజకీయ పక్షాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ తో పాటు ఇతర రాజకీయ పక్షాలన్నీ ఏకమతున్నాయి. గులాబీయేతర పక్షాలన్నీ కలవడం దాదాపు ఖాయమైన తరుణంలో సీట్ల పంపకాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం, తెలంగాణ జన సమితి పార్టీలు బలంగా ఉన్నాయి. సీపీఐ, సీపీఎం శ్రేణులు ఎంతో కొంత ఓట్లను తెచ్చి పెట్టే స్థాయిలోనే ఉన్నాయి.
అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా క్లారిటీ రాలేదు. బోధన్ లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఆర్మూర్ నుంచి శాసనమండలి సభ్యురాలు ఆకుల లలితను బరిలోకి దింపే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన రాజారాం యాదవ్ అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. బాల్కొండ నుంచి ఈరవత్రి అనిల్ ను అనుకుంటున్నారు. నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డికి టికెటిచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కోటాలో మాజీ ఎమ్మెల్సీ అయిన అరికెల నర్సారెడ్డి కూడా టికెట్ కోసం పట్టుబడుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి నాలుగు పర్యాయాలుగా కాంగ్రెస్ విజయం సాధించడం లేదు. డీఎస్ రేపోమాపో పార్టీలో చేరనుండటంతో.. ఆయన సూచనల మేరకు అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.
టీడీపీ, తెలంగాణ జన సమితి నేతలు ఈ జిల్లాలో ఒక్కో స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట తమకు అడ్జస్ట్ చేయాలని పార్టీ పెద్దలు ఈ పాటికే ప్రతిపాదించినట్లు సమాచారం. బాల్కొండ నియోజకవర్గం కేటాయించాలని ఆ పార్టీ నేత నారా లోకేశ్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణ తనయుడైన మల్లికార్జున్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలంగాణ జన సమితి మాత్రం నిజామాబాద్ అర్బన్ పై కన్నేసింది. టీజేఎస్ జిల్లా కన్వీనర్ అంబోజి ప్రసాద్ ను అర్బన్ బరిలోకి దింపాలని భావిస్తున్నారు. జర్నలిస్ట్ గా పని చేసిన ప్రసాద్ ఇంటింటి తలుపు తడుతూ మహాపాదయాత్ర చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో మూడు కాంగ్రెస్ కు, ఒకటి టీడీపీకి, మరోటి టీజేఎస్ కు దక్కే అవకాశాలున్నాయి.