ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో… వైకాపా నేతలు సంఘీభావ యాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ యాత్ర 3000 కి.మీ. మైలురాయి దాటిన సందర్భంగా ‘జగన్ రావాలి, జగన్ కావాలి’ అంటూ వైకాపాలోని అన్ని శ్రేణుల నేతలూ కార్యకర్తలూ యాత్రలు చేస్తున్నారు. అన్ని నియోజక వర్గాల్లో ఇదే హడావుడి కనిపిస్తోంది. ప్రజలందరూ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నారనీ, జగన్ వస్తే తప్ప సమస్యలు తీరవని అభిప్రాయాపడుతున్నారంటూ వైకాపా నేతలు ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి.
గతంలో ‘గడప గడపకీ వైకాపా’ అంటూ ఓ కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. అయితే, అనుకున్న స్థాయిలో అది ఫలితాలను సాధించలేకపోయింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఆదరాబాదరాగా ప్రకటించేశారే తప్ప… సరైన కార్యాచరణ ఏంటనే చర్చ కూడా పార్టీలో జరగలేదనీ, ప్రజల్లోకి నేతలూ కార్యకర్తలూ వెళ్లిపోవాలని చెప్పారే తప్ప, వెళ్లాక ఏం చెయ్యాలనే పక్కా వ్యూహాన్ని ఖరారు చెయ్యలేదంటూ అప్పట్లో వైకాపా శ్రేణుల నుంచే విమర్శలు వినిపించాయి. అంతేకాదు, కార్యకర్తల్ని రోజూ వెంటేసుకుని కార్యక్రమాలు నిర్వహించాలంటే బోలెడు ఖర్చనీ, దాన్ని ఎవరు భరించాలీ ఎందుకు భరించాలీ అనే చర్చ కూడా నేతల మధ్య జరుగుతోందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడీ ‘జగన్ రావాలీ కావాలీ’ కార్యక్రమం కూడా అదే మూస ధోరణిలో ఉందనే గుసగుసలు వైకాపా వర్గాల్లో వినిపిస్తున్నట్టు సమాచారం.
ఎన్నికలకు చాలా సమయం ఉందనీ, ఇప్పట్నుంచే నియోజక వర్గాల స్థాయిలో ప్రతీరోజూ కార్యక్రమాలు నిర్వహించాలంటే నాయకత్వ లోపం కొంత ఉంటోందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై స్పష్టత లేని నియోజక వర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించాలనే సందిగ్దం ఉంటోందన్న అభిప్రాయామూ వినిపిస్తోంది. కార్యకర్తల్ని తిప్పుకోవడం, వారికి రోజువారీ భోజనాల ఖర్చుల వంటి విషయాల్లో కొంత చర్చ జరుగుతోందట! తమకు టిక్కెట్ కన్ఫర్మ్ అయితే ఎంతైనా ఖర్చు చేస్తాంగానీ, ఏదీ తేల్చకుండా కార్యక్రమాలు చేసెయ్యండి అంటే ఎలా అంటూ ఆఫ్ ద రికార్డ్ కొందరు నేతల మధ్య చర్చ జరుగుతోందని తెలుస్తోంది! పైగా, ఈ కార్యక్రమం కూడా కేవలం టీడీపీపై విమర్శలు చేయడం, నవరత్నాలకు సంబంధించిన ఒక పాంప్లెట్ పంచడం తప్ప… కొత్తగా ప్రజలను ఆకర్షించే అజెండా లేదనే అభిప్రాయమూ ఆ వర్గాల నుంచే వినిపిస్తోంది. వాస్తవానికి ఈ లోపం మొదట్నుంచీ వైకాపాకి ఉండదనే ఉంది! పార్టీ అధినాయకత్వం నుంచి కింది స్థాయి నేతల వరకూ అందరూ… సమస్యలు తీరాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలనే అంటున్నారు. కానీ, సమస్యలకు జగన్ ఎలా పరిష్కారాలు చూపించగలరు అనే స్పష్టత ఇప్పటికీ ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు.