ఇద్దరు హీరోల సినిమా అంటే దర్శకులు కాస్త భయపడుతుంటారు. ఓ హీరో ‘ఈగో’ని సంతృప్తి పరచడమే కష్టం. అలాంటిది ఇద్దర్ని భరించాలంటే… అది సాహసమే అవుతుంది. మల్టీస్టారర్ చిత్రాల కోసం దర్శకులు ముందుకు రాకపోవడానికి ఇదో బలమైన కారణం. ‘దేవదాస్’ తెరపై నాగ్, నానిల కెమెస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఆసినిమా కేవలం వాళ్లిద్దరి కోసం చూసేయొచ్చు.. అనిపించేంత అందంగా ఉంది. అయితే… ఇద్దరు హీరోలతో దర్శకుడికి కాస్త కష్టమైందన్నది టాలీవుడ్ జనాల టాక్. మరీ ముఖ్యంగా ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఆ సమస్య మరింత ఎక్కువైందట.
ఎడిటింగ్ దగ్గరే సినిమా రూపు రేఖలు మారిపోతుంటాయి. చిన్న చిన్న మార్పులే.. సినిమా భవిష్యత్తుని, తలరాతని నిర్ణయిస్తాయి. అందుకే హీరోంతా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అయితే ఈ సినిమాకి ఇద్దరు హీరోలు కాబట్టి.. ఇద్దరూ కూర్చోవాల్సివచ్చింది. నాని వచ్చి… కొన్ని మార్పులు చెప్పి వెళ్లిపోయేవాడట. ఆ తరవాత నాగ్ వచ్చి..’ అలా కాదు.. ఇలా మార్చండి’ అనేసరికి ఆ మార్పులు మళ్లీ మొదటికి వచ్చేవని… చివర్లో దర్శకుడు రంగంలోకి దిగి..’ఇదిగో.. ఇలా మార్చండి’ అనే సరికి సినిమా మరో రూపంలోకి వెళ్లేపోయేదని.. ఆశ్వనీదత్, ప్రియంక, స్వప్న… ఇలా ఈ సినిమాలోని బృందంతా తలో సలహా ఇవ్వడం, ఎవరు పడితే వాళ్లు చేయి వేయడం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యేవని సమాచారం. ‘దేవదాస్’ సినిమా చూస్తే కొన్ని జర్క్‌లు కనిపిస్తాయి. లింకులు తెగిపోయినట్టుగా అనిపిస్తుంటుంది. అదంతా ఎడిటింగ్ మహత్య్మమే. సినిమా విడుదలకు ముందు కొన్ని సన్నివేశాల్ని తొలగించడం, ఇంకొన్ని ట్రిమ్ చేయడం జరిగిపోయాయి. దాంతో…అక్కడక్కడ సినిమా జంప్ అయిన ఫీలింగ్ కలుగుతుంటుంది. ఈ మార్పుల వల్ల సినిమాకి మేలు జరిగిందా? లేదా? అనేది మాత్రం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. సినిమా తీసిన వాళ్లకూ చేసిన వాళ్లకు మాత్రం ఆ తేడా స్పష్టంగా అర్థమవుతుంది.