జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన హత్యకు కుట్ర పన్నారంటూ.. సంచలన ఆరోపణలు చేయడమే కాదు… ఆడియో టేపులు కూడా ఉన్నాయని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వం తరపున ఎలాంటి చిన్న పొరపాటు జరగకూడదన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా పవన్ కల్యాణ్‌కు భద్రత పెంచారు. పవన్ కల్యాణ్ ఇంకా ఆ ఆడియో టేపులు ప్రభుత్వానికి కానీ.. పోలీసులు కానీ ఇవ్వకున్నా.. తమ విచారణ మాత్రం ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై స్పందించారు. పవన్‌కు భద్రత పెంచుతామని ప్రకటించారు. పోలీసు వ్యవస్థపై అందరికీ నమ్మకముండాలన్నారు.
అదే సమయంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్… పవన్ తన దగ్గర ఉన్న ఆధారాలు పోలీసులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ ముగ్గురెవరో చెప్పాలని, ఆధారాలు ఏమైనా ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఆందోళన కారణంగా ఆయన భద్రతను కూడా పెంచుతున్నట్లు ఎస్పీ ప్రకటించారు. జిల్లాలో పవన్ పర్యటన జరిగినన్ని రోజులు వ్యక్తిగత భద్రతతో పాటు, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు అదనపు భద్రత కల్పిస్తామని స్పష్టం చేసారు. ” 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తనను హత్య చేసేందుకు ఓ ముగ్గరు కుట్ర పన్నుతున్నారని, ‘పవన్ కల్యాణ్‌ను చంపితే ఏమవుతుంది. మహా అయితే ఓ నెల రోజులు గొడవలు అవుతాయని ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వాళ్లు ఏ పార్టీ వారో, ఆ వ్యక్తుల పేర్లు తెలుసు, వారి ముఖాలు కూడా నాకు తెలుసు” అని ఏలూరు బహిరంగ సభలో ప్రకటించారు.
ఆ ముగ్గురు ఎవరో తేల్చాలని.. ఏ పార్టీ వారైనా వదిలి పెట్టకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. హింసా రాజకీయాలకు.. టీడీపీ వ్యతిరేకమని ముఖ్యమంత్రి కూడా పదే పదే చెబుతున్నారు. ఈ విషయంలో అంతర్గతంగా ఇప్పటికే పోలీసు దర్యాప్తు ప్రారంభమైనట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రేపోమాపో ఆ ఆడియో టేపుల కోసం పవన్ కల్యాణ్ వద్దకు పోలీసులు వెళ్లే అవకాశం కూడా ఉంది.