‘మజిలీ’ మొదలైంది… అదీ హీరో హీరోయిన్లు లేకుండా! సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రతి సన్నివేశంలో హీరో హీరోయిన్లు వుండాలని రూల్ ఏం లేదు కదా! లీడ్ పెయిర్ లేనటువంటి సన్నివేశాలు కొన్ని వుంటాయి. ప్రస్తుతం దర్శకుడు శివ నిర్వాణ అటువంటి సన్నివేశాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు అవసరం లేనటువంటి సన్నివేశాలను చకచకా తీసేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే… నాగచైతన్య, సమంత జంటగా ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘కృష్ణార్జున యుద్ధం’ తరవాత షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘మజిలీ’ టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఇటీవల సినిమా షూటింగ్ మొదలైంది. ‘శైలజారెడ్డి అల్లుడు’ ‘యూ టర్న్’ విడుదల తరవాత చైతూ, సమంత విదేశాలకు హాలిడే ట్రిప్‌కి వెళ్లారు. ఇంకా ఇండియా రాలేదు. ప్రస్తుతం క్రొయేషియాలో వున్నట్టు తెలుస్తుంది. వాళ్లిద్దరూ లేకుండా శివ నిర్వాణ షూటింగ్ స్టార్ట్ చేశారు.
హాలిడే ట్రిప్ నుంచి వచ్చాక చైతూ, సమంత షూటింగులో పాల్గొంటార్ట. వివాహం తరవాత నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న సినిమా ఇది. పెళ్లి తరవాత భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్థలు వచ్చాయని కథాంశంతో సినిమా రూపొందుతుండటం విశేషం.