ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా… దాన్ని తీసుకొచ్చి ఏపీ అధికార పార్టీకి ముడేయడమే ‘సాక్షి’కి తెలిసిన జర్నలిజం అన్నట్టుగా ఉంది! తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో రెండ్రోజులపాటు ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. పన్నులు చెల్లించని ఆస్తులు ఉన్నాయనీ, వాటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 3న రేవంత్ ను ఐటీ కార్యాలయానికి విచారణకు రమ్మంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే, దీన్లో సాక్షి వెతుక్కున్న కోణం ఏంటంటే… రేవంత్ ఇంట్లో దాడులు జరగడంతో, ఏపీలో కొంతమంది కీలక నేతలకు గుబులు మొదలైందట అంటూ ఓ కథనం వండివార్చారు.
‘ఓటుకు కోట్లు ఎక్కడివి’ అనే శీర్షికతో శనివారం ఒక బ్యానర్ స్టోరీ అచ్చేశారు. రేవంత్ ఇంట్లో ఐటీ సోదాల నేపథ్యంలో ఓటుకు నోటు కేసు ఒక కొలీక్కి వస్తుందా, ఆ కేసులో స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎవరిచ్చారనేది బయటకి వచ్చేస్తుందా..? ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరునేది తెలిసిపోనుందా… అంటూ సాక్షి కొన్ని అనుమానాలను లేవనెత్తింది. తాజా దాడుల్లో ఓటుకు నోటు అంశం తెరమీదికి రావడంతో ఆంధ్రాలో ఈ కేసుకు సంబందం ఉన్నవారికి టెన్షన్ మొదలైందని రాశారు. స్టీఫెన్ సన్ కి నిధులు సమకూర్చిన ఒక ఏపీ మంత్రి, ఉదయ్ సింహ మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలిసిందంటూ రాశారు.
ఓవరాల్ గా సాక్షి ఉద్దేశం ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! అయితే, ఇక్కడ అసలు విషయం ఏంటీ… రేవంత్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి, ఇది ఆస్తులకు సంబంధించిన వ్యవహారం. దీనికీ ఓటుకు నోటు కేసుకీ సంబంధం ఏముంది..? దీని వల్ల ఓటుకు నోటు కేసు ఒక కొలీక్కి ఎలా వచ్చేస్తుంది..? ఐటీ దాడుల నేపథ్యంలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసే పరిస్థితీ ఇప్పటికైతే లేదు. ఎందుకంటే, ముందుగా ఐటీ కార్యాలయానికి వెళ్లి ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దానిపై అధికారులు సంతృప్తి చెందకపోతే తదుపరి చర్యలు ఉంటాయి. అవి కూడా కేవలం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అనే కోణం నుంచే ఉంటాయి. అంతే తప్ప… ఓటుకు నోటు కేసుతో లింక్ పెట్టే పరిస్థితి ఉండదు. ఆస్తుల వివరాల సేకరణలో భాగంగా అడిగిన 150 ప్రశ్నల్లో.. ఓటుకు నోటు కేసు సమయంలో రూ. 50 లక్షలకు సంబంధించి ఒక ప్రశ్న అడిగినట్టు సమాచారం బయటకి వచ్చింది. అంతేగానీ, సాక్షి చెబుతున్నట్టుగా కేవలం ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం రాబట్టడం కోసమే ఐటీ దాడులు జరగలేదు కదా.
రేవంత్ ఇంట్లో ఐటీ సోదాలు సరికాదనే అభిప్రాయం వెల్లడించడం ఇక్కడి ఉద్దేశం కాదు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు గుర్తించే… వాటిపై కచ్చితంగా చర్యలు ఉండాల్సిందే. అయితే, ఈ నేపథ్యంలో సాక్షి ధోరణి స్వార్థ రాజకీయ బుద్ధితో ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తాజా దాడులకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారమూ వెల్లడి కాలేదు, కానీ ఈలోగా ఓటుకు నోటు కేసుపై ఏదో జరిగిపోతోందన్న ఊహాగానాలను ప్రజల్లోకి సాక్షి పంపించే ప్రయత్నాలు చేస్తోంది.