విజయ్ దేవరకొండ తెలుగు మాట్లాడితేనే కొత్త కొత్తగా ఉంటుంది. ఇప్పుడు అలాంటిది తమిళం లో స్పీచులు దంచేస్తున్నాడు. తమిళ హీరోలంతా తెలుగులోకి వచ్చి, తెలుగు నేర్చుకోవడానికి, తెలుగు మాట్లాడడానికి టైమ్ తీసుకుంటుంటే.. విజయ్ మాత్రం తన తొలి సినిమాతోనే తమిళంతో ప్రావీణ్యం తెచ్చేసుకున్నాడు. విజయ్ నటించిన `నోటా` తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. చెన్నైలో ప్రమోషన్ ఈవెంట్లలో విజయ్ తమిళంలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విజయ్ తొలి తమిళ ప్రెస్ మీట్లో పాల్గొన్నప్పుడు తమిళం రాదు. అయితే `నోటా` పూర్తయ్యేసరికి ఆ భాషపై పట్టు సాధించేశాడు. ఎంతగా అంటే… తమిళ కవుల కోట్స్‌ని కూడా ఉదహరిస్తూ స్పీచులు ఇచ్చేంతగా. ఇంత అనర్గళంగా తమిళం మాట్లాడుతున్న విజయ్‌ని, అతని డెడికేషన్నీ చూసి, అక్కడి మీడియా, సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. `నోటా` విజయోత్సవ సభలో తమిళంలో కవిత్వం కూడా చెబుతానని.. ప్రామిస్ చేశాడు విజయ్. తమిళం కోసం ఓ ట్యూటర్ని పెట్టుకుని, ఆ భాషని నేర్చుకున్న విజయ్.. `నోటా` హిట్టయితే తమిళంలోనూ పాగా వేసేయాలని చూస్తున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి మరి.