తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు చేస్తున్న కుట్రల కారణంగానే.. కేంద్రంతో కలిసి తనపై కేసులు పెడుతున్నట్లు… కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన ఇంటిపై జరిగిన ఐటీ దాడుల నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటిని కుటుంబసభ్యులు కొనుగోలు చేశారని.. 2009 ఎన్నికల అఫిడవిట్‌కు.. 2014 ఎన్నికల అఫిడవిట్ ను పోల్చి చూడాలని ఆయన ప్రజలను కోరారు. 2009 తర్వాత తాను ఒక్క ఆస్తిని కూడా కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. 2014లో కేంద్ర ఎన్నికల సంఘం మార్కెట్ విలువను మాత్రమే చెప్పాలని ఆదేశించిందని.. దాని ప్రకారమే.. ఆస్తులు ఎక్కువగా కనిపించాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు. 2009కి.. 2014కి ఆస్తుల్లో ఎలాంటి తేడా లేకపోయినా.. మార్కెట్ విలువలో పెరుగదల వల్లే.. వ్యత్యాసం కనిపిస్తోందని స్పష్టం చేశారు.
తనపై ఎవరో చేసిన ఫిర్యాదు విషయంలో మీడియా విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే తాను ప్రజలకు వివరణ ఇస్తున్నానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సింగపూర్, హాంకాంగ్, మలేషియాల్లో వ్యాపారాలు చేసినట్లు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని అంశాలను తనకు అంటగట్టి ప్రచారం చేశారన్నారు. తన ఇంటి అడ్రస్‌తో బినామీ కంపెనీలు ఉన్నాయని చెబుతున్నారని.. కానీ తన ఇంటిని ఇరవై మూడేళ్లుగా అద్దెకు ఇచ్చానని స్పష్టం చేశారు. అందులో నాలుగు అంతస్తులు ఉన్నాయని… అక్కడ అద్దెకు తీసుకున్న వాళ్లు..ఆ అడ్రస్‌తో కంపెనీని రిజిస్టర్ చేసుకుంటే తనకేం సంబంధమని ప్రశ్నించారు. తనకు విదేశాల్లో బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతూండటంపై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విదేశాల్లో భారతీయ పౌరసత్వం కలిగిన వాళ్లు బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించడానికి, ఆస్తులు కొనుగోలు చేయడానికి..ఎలాంటి నిబంధనలు ఉంటాయో ఓ సారి పరిశీలించాలని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హాంకాంగ్‌లో బ్యాంక్ అకౌంట్ అక్కడి పౌరులకు మాత్రమే ఇస్తారన్నారు. మలేషియాలో అంత కంటే కఠినమైన నిబంధనలే ఉంటాయని గుర్తు చేశారు.
తన పెళ్లి కంటే ముందే తన మామ కోటీశ్వరుడనే సంగతిని గుర్తు చేశారు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు చిల్లర వ్యక్తులన్నారు. కేసీఆర్, మోడీ కలిసి కుట్రలు చేస్తున్నారని.. కేసీఆర్ అధికారాన్ని నిలబెట్టుకునేందుకే తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ప్రగతి భవన్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజుల క్రితం.. రేవంత్ కు చెందిన 15 చోట్ల సోదాలు ప్రారంభించిన ఐటీ అధికారులు.. నిన్న తెల్లవారు జామున రెండున్నర గంటలకు ముగించారు. అక్టోబర్ మూడో తేదీన ఐటీ ఆఫీసులో హాజరు కావాలని రేవంత్ కు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు.