అరవింద్ స్వామి.. 90వ దశకంలో మార్మోగిన పేరు. రోజా, ముంబయి సినిమాలు చూశాక.. దేశంలోని అమ్మాయిలంతా అరవింద్ స్వామి ఫ్యాన్స్ అయిపోయారు. కథానాయకుడిగా కొంత బ్రేక్ తీసుకుని `కడలి`తో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన అరవింద్ స్వామికి `తని ఒరువన్` గొప్ప విజయాన్ని అందించింది. దాన్ని `ధృవ`గా రీమేక్ చేసినప్పుడూ అరవింద్ స్వామినే ఎంచుకున్నారు. తెలుగులోనూ ఆ పాత్రకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు `నవాబ్`లోనూ అరవింద్ స్వామి తన విశ్వరూపం చూపిస్తున్నాడు. త్వరలోనే మెగాఫోన్ పట్టుకోబోతున్నట్టు సంకేతాలిచ్చాడు అరవింద్ స్వామి. మూడు కథలు తన దగ్గర సిద్దంగా ఉన్నాయని అందులో ఓ సినిమాని అతి త్వరలో మొదలెడతానని చెప్పుకొచ్చాడు. “నా పాత్ర గురించీ, కథ గురించీ క్షుణ్ణంగా చర్చించాకే ఓ సినిమా ఒప్పుకుంటా. సృజనకు సంబంధించిన సలహాలూ ఇస్తుంటా. అందుకే కథ గురించీ దర్శకత్వం గురించీ ఓ అవగాహన ఏర్పడింది. ఎప్పటి నుంచో దర్శకత్వంపై గురి ఉంది. కానీ కుదరడం లేదు. అతి త్వరలోనే నా కల నెరవేర్చుకుంటా“ అంటున్నాడు అరవింద్ స్వామి. తెలుగులో ధృవ తరవాత తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని, అయితే ఏదీ ఒప్పుకోలేదని, త్వరలో ఓ తెలుగు చిత్రానికి సంతకం చేయబోతున్నానని చెప్పుకొచ్చాడు. మరి ఆ సినిమా ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.