తెలంగాణలో మహా కూటమి ఏర్పాటు అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి, గడచి నాలుగైదు రోజులుగా.. కూటమి అనేది సాధ్యమా, ఆయా పార్టీ మధ్య సఖ్యత వస్తుందా, సీట్ల సర్దుబాట్లలో సిగపట్లు తప్పవా అనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ జోరుగా జరిగింది. అన్నిటికీ మించి, తెలంగాణ జనసమితి పార్టీ ఈ కూటమిలో ఇమడగలుగుతుందా అనే చర్చ ఇంకా వినిపిస్తోంది. ఎందుకంటే, ఆ పార్టీ అధినేత కోదండరామ్ ఆశిస్తున్న స్థాయిలో కూటమి నుంచి జనసమితికి సీట్లు దక్కే అవకాశం దాదాపు తక్కువగా కనిపిస్తోంది కదా! అయితే, ఆ అసంతృప్తి ఆయనకూ లేకుండా చేసి, ఆయన సేవల్ని కూటమి సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
మహా కూటమి ఒక కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ని ప్రకటించే దిశగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ కి ఒక పేరు పెట్టబోతున్నారనీ, దీనికో కమిటీ వేసి, నిర్వహణ బాధ్యతల్ని కోదండరామ్ కి అప్పగించాలనే ప్రతిపాదన తెర మీదికి వచ్చినట్టు సమాచారం. ఇదే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే జన సమితితో కూడా చర్చించినట్టు సమాచారం. గతంలో, యూపీయే హయాంలో కూడా ఇలానే కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ఉంటే… దాని నిర్వహణ కమిటీ అధ్యక్ష బాధ్యతల్ని సోనియా గాంధీకి అప్పగించారు. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలో కూటమి హామీల నిర్వహణ కమిటీకి కోదండరామ్ ని ఛైర్మన్ చేస్తారన్నమాట.
నిజానికి, కోదండరామ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అనూహ్యమైన ప్రాధాన్యత వచ్చే అవకాశాలు చాలా తక్కువే అనేది వాస్తవం! కానీ, ఇలాంటి కమిటీకి ఛైర్మన్ అనగానే… ఆయనపై కొంత పాజిటివ్ దృక్పథం కలుగుతుంది. తెలంగాణ ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలరనే నమ్మకం ప్రజల్లో బాగానే ఏర్పడుతుందనేది కూటమిలో ప్రముఖ పార్టీల ఆలోచనగా తెలుస్తోంది. సో, ఈ విధంగా కోదండరామ్ సేవల్ని కూటమి వినియోగించుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.