గత ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమైన రాములమ్మ ఉరఫ్ విజయశాంతి తెలంగాణ కాంగ్రెస్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ప్రచార బాధ్యత అంతా తనదే అని ఆమె భావిస్తున్నారు. కర్ణాటక తరహాలో మూడు హెలికాఫ్టర్లు, సోనియా, రాహుల్‌ల సభలతో హోరెత్తించాలని నిర్ణయించారు. స్టార్ క్యంపైనర్ సుడిగాలి పర్యటనలు దీనికి అదనం. రెడీ చేసుకోవాలనుకుంటున్న మూడు హెలికాఫ్టర్లలో ఒకటి స్టార్ క్యాంపెయినర్ కోసం కేటాయిస్తారు. అన్ని నియోజకర్గాల్లోనూ రాములమ్మ ప్రచారం చేయనున్నారట. కాంగ్రెస్ తొంభై నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటోంది. ఈ 90 నియోజకవర్గాల్లోనూ… విజయశాంతి ప్రచారం చేస్తారు. దాదాపుగా 45 రోజులు పాటు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున ఈ ప్రచారం ఉంటుంది. నియోజక వర్గ, మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో ఎప్పుడూ గాంధీభవన్ కు రాని.. విజయశాంతి.. స్టార్ క్యాంపెయినర్‌గా తొలి సారి గాంధీభవన్‌కు వచ్చి మీటింగ్‌లో పాల్గొని.. తన షెడ్యూల్కుసంబంధించిన డిమాండ్లను వినిపించారు.
తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఓటు వేయాలనే కాన్సెప్ట్‌ను… కాంగ్రెస్ ప్రచారంలోకి తీసుకురాబోతోంది. సోనియాగాంధీ తో మూడు సభలు పెట్టనున్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో 10 సభలు కర్ణాటక తరహాలో నిర్వహించి రాష్ట్రమంతా కలియ తిరిగేలా ప్లాన్ చేస్తుంది. సోనియాగాంధీ తో ఉత్తర తెలంగాణలో ఒక సభ , దక్షణ తెలంగాణ లో మరో సభ , హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. ఇక ఉద్యమకారులు తమ వెంట ఉన్నారనే చెప్పుకోవడానికి గద్దర్ , విమలక్క లను కలుపుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే గద్దరతో మల్లు భట్టి విక్రమార్క చర్చలు జరిపారు.
కానీ ప్రచార కమిటీ ప్రణాళికలు భారీగానే ఉన్నా… స్టార్ క్యాంపెయినర్కి… ప్రచార కమిటీ చైర్మన్లు అయిన… భట్టి, డికే అరుణలకు మధ్య… పొసగడం కష్టమే. ఎవరి దారి వారిదేనన్నట్లుగా వ్యవహారం ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. నాలుగేళ్ల తర్వాత వచ్చిన విజయశాంతికి స్టార్ క్యాంపెయినర్ పదవి ఏమిటన్న చర్చ ఇప్పటికే గాంధీభవన్ సీనియర్లలో నడుస్తోంది. అంటే.. విజయశాంతికి సహకారం ఉండటం కష్టమే. స్టార్ క్యాంపెయినర్ ప్రచారం ఎలా ఉంటుందో… ఒకటి, రెండు సభలు పూర్తి చేసిన తర్వాతే తెలుస్తోంది. దాన్ని బట్టి విజయశాంతి… మిగతా సభలకు వెళ్తారో.. తన సహజసిద్ధమైన అసంతృప్తిని వెళ్లగక్కి సైలెంట్‌గా ఉండిపోతారో తేలిపోతుంది.