“నా పాటను మళ్ళీ నేనే వాడుకుంటే కాపీ అంటారేంటి?” – సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఇతణ్ణి ‘కాపీ క్యాట్’ అని కామెంట్ చేసేవాళ్ళ సంఖ్య ఇంటర్నెట్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో వుంటుంది. తమన్ నుంచి కొత్త పాట రావడం ఆలస్యం ‘అక్కణ్ణుంచి కాపీ కొట్టాడు. ఇక్కణ్ణుంచి కాపీ కొట్టాడు’ అని విమర్శిస్తుంటారు. ఈ విమర్శలకు ‘బిజినెస్మేన్’లో ‘పిల్లా చావ్’ పాట పునాది వేసింది. అయితే పూరి జగన్నాథ్ స్వయంగా “నేను కోరడంతో తమన్ ఆ పాట కొట్టాడు” అని చెప్పినా విమర్శలు ఆగలేదు. తమన్ సంగీతం అందించిన తాజా సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’ పాటల విషయంలో కూడా విమర్శలు వచ్చాయి. తమన్ సంగీతం అందించిన పాత పాటలను మళ్ళీ కాపీ కొట్టాడని కామెంట్లు చేస్తున్నారు. వీటిపై తాజా ఇంటర్వ్యూలో తమన్ స్పందించాడు.
“నా పాటను మళ్ళీ నేను వాడుకుంటే కాపీ అని ఎలా అంటారు? ఓ రచయిత ఒక పాటలో ‘ప్రేమ’ అని పదాన్ని రాస్తారు. మళ్ళీ ఇంకో పాటలో ‘ప్రేమ’ అని రాస్తే కాపీ అంటారా? ఇటువంటి విమర్శలపై ఐ డోంట్ కేర్. సోషల్ మీడియాలో ఎవరో ఏవో కామెంట్స్ చేస్తే పట్టించుకోను. వాటికి ప్రాధాన్యం ఇస్తే నేను నా పని చేసుకోలేను” అని తమన్ సెలవిచ్చాడు. అసలు కాపీ అనడమే తప్పు అని పేర్కొన్నాడు.
ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ వుంటుందనీ, తన స్టైల్ తనదనీ అన్నాడు. “మళ్ళీ మళ్ళీ విమర్శిస్తే నేనేం చేయను. నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం కోసం ఏదో ఒకటి మాట్లాడను. కామెంట్ చేయడం వాళ్ళ బతుకు అనుకుంటే బతకనివ్వండి. హ్యాపీగా కామెంట్ చేసుకోమనండి. నాకు ఏం నష్టం లేదు” అని తమన్ చెప్పాడు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు తనను నమ్ముతున్నారని… విమర్శల వల్ల తనకు పోయేది ఏమీ లేదని, ప్రశంసల వచ్చేది ఏమీ లేదని పేర్కొన్నారు.