దేశ రక్షణకు సంబంధించిన అంశాలను… భారతీయ జనతా పార్టీ రాజకీయానికి వాడుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలను.. మొదట్లో దేవరహస్యం అన్నట్లు దాచి పెట్టి..అప్పుడొకటి.. అప్పుడొకటి రిలీజ్ చేసి.. మోడీని పొగిడేసుకుంటున్నారు. మొన్నామధ్య ఓ సైనికుడ్ని అత్యంత దారుణంగా పాకిస్థాన్ బలగాలు హతమార్చాయన్న ప్రచారం జరిగింది. దీంతో మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేశామని.. పాకిస్థాన్ బలగాలను చావు దెబ్బ కొట్టామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెబుతున్నారు. త్వరలోనే.. అంటే.. ఎన్నికలకు కొద్దిగా ముందుగా దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వస్తాయని చెబుతున్నారు కూడా…!
కొద్ది రోజుల నుంచి ముఖ్యంగా.. రాఫెల్ స్కాం బయటపడినప్పటి నుంచి పాకిస్థాన్ అంశాన్ని బీజేపీ పదే పదే ప్రస్తావిస్తోంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని పాకిస్థాన్ కోరుకుంటోందని.. చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించి ఆ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మోడీ అంటే.. పాకిస్థాన్ వణికిపోతోందని.. ఆయన ప్రధానిగా ఉంటే… పాకిస్థాన్ ఆటలు సాగడం లేదని.. ఎవరో ముస్లిం నేతలు ప్రసంగిస్తున్నట్లుగా వీడియోలు ప్రచారం చేసేస్తున్నారు. పాకిస్థాన్‌ను నిలువరించాలంటే… మోడీ ప్రధానిగా ఉండాలన్నట్లుగా.. ఆ వ్యవహారం ఉంది. దానికి తగ్గట్లుగానే భావోద్వేగం పెంచడానికి ఒక్కో స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నారన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. నిజానికి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాలుగున్నరేళ్లలో నాలుగున్నరేళ్లలో పాకిస్థాన్‌ను ఎంత మేర కట్టడి చేశారు..?. చివరికి కశ్మీర్లో ప్రభుత్వంలో భాగంగా ఉండి కూడా శాంతిభద్రతలను రక్షించలేక.. మిత్రపక్షంపై నెపం వేసి ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. జమ్మూకశ్మీర్ రానురాను రావణకాష్టం అయిపోతోంది తప్ప.. ఏ మాత్రం.. మెరుగపడలేదు.
దౌత్యపరంగా పాకిస్థాన్ తో ఏమైనా ముందడుగు వేశారా అంటే..అదీ లేదు. పాకిస్థాన్ కొత్త అధ్యక్షుడితో చర్చలు ప్రారంభించాల్సిన అవకాశం వస్తే..అవమానించి పక్కన పెట్టేశారు. వారు మరింతగా రగిలిపోయేలా చేశారు. ఇలా చేస్తే.. మరింత భావోద్వేగాలను ప్రజల్లో రెచ్చగొట్టవచ్చనేది ప్లాన్ కావొచ్చు. కానీ దేశ భద్రతకు సంబంధించి.. దౌత్యవిధానాలను సంబంధించిన విషయాలను కూడా రాజకీయాలకు వాడుకుంటారా..? ఇప్పుడు కొత్తగా పాకిస్థాన్ పై … శతఘ్ని దాడులు చేశామంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఎంత చేసినా… రాఫెల్ స్కాంపై సమాధానం చెప్పనంత వరకూ… ఈ సూడో దేశభక్తికి అర్థం ఉంటుందా..? ఐదేళ్ల కాలంలో.. పాకిస్థాన్ తో ఎంత గొప్పగా పోరాడారో చూశారు కాబట్టి.. మరోసారి రెచ్చగొడితే.. మోడీనే పోరాటయోధుడని ప్రజలు నమ్మేస్తారా..?