అబ్బాయిలు అందరికీ యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్ ఒక సలహా ఇచ్చాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలో తెలియక సతమమయ్యే రామ్ సలహా పనికొస్తుందేమో! “వీడు పెళ్లి చేసుకుంటే చాలురా బాబు” అనుకునే టైమ్‌లో ఏ అమ్మాయిని తీసుకువెళ్లినా ఇంట్లోవాళ్ళు యస్ చెప్పేస్తారని రామ్ చెప్పుకొచ్చాడు. అతను కూడా అదే విధంగా చేస్తాడో? ఏమో? చెప్పలేదు కాని… ఇప్పటివరకూ ఏ అమ్మాయి నచ్చలేదని తెలిపాడు. తనకు నచ్చే లక్షణాలున్న అమ్మాయి తారసపడలేదట. తనకు ఎవరైనా అమ్మాయి కనెక్ట్ అయితే ఓ అర్ధరాత్రి (మిడ్నైట్) ‘రామ్‌కి ఎంగేజ్మెంట్ అయ్యిపోయింది’ అని మీడియాకు ఫోన్ రావొచ్చని రామ్ పేర్కొన్నాడు.
‘పండగ చేస్కో’ టైమ్‌లో తనకు, రకుల్‌కి నిశ్చితార్థం జరిగిందని వచ్చిన వార్తలను రామ్ ఖండించాడు. ఇటువంటి పుకార్లను ఎలా పుట్టిస్తారో తెలియదని విస్మయం వ్యక్తం చేశాడు. “రకుల్‌తో నిశ్చితార్థం జరిగిందని వచ్చిన పుకారు నా వరకూ రాలేదు. మామూలుగా నా మీద గాసిప్స్ వస్తే మా అన్నయ్య, స్నేహితులు చెబుతుంటారు. ఇప్పటివరకూ నా మీద గాసిప్స్, హీరోయిన్లతో లింకప్ చేస్తూ వార్తలు రాలేదు. మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడూ ‘నీ మీద గాసిప్స్ రావడం లేదేంటి?’ అని ఆట పట్టిస్తుంటారు” అని రామ్ అన్నాడు. ఈ యంగ్ హీరో నటించిన ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. ప్రేమ కోసం ఓ కుర్రాడు ఏం చేశాడనే కథతో సినిమా రూపొందిందని రామ్ తెలిపాడు.