కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు… ఓ సంచలనం. కేసీఆర్ మోదీతో కుమ్మక్కయ్యారని.. తనను లక్ష్యం చేసుకున్నారని ఆయన ముందు నుంచి చెబుతున్నట్లుగానే.. ఆయన ఇంట్లో సోదాలు జరిగాయి. అరెస్ట్ చేయడం ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికైతే నోటీసులతో సరి పెట్టారు. ఈ ఘటనలపై.. ప్రజల్లో రకరకాల చర్చ జరుగుతోంది. అందులో ప్రధానమైనది కుల పోరాటం. రేవంత్ పై ఫిర్యాదు చేసిన… రామారావు అనే లాయర్ .. నేరుగా… వెలమలను రేవంత్ తిడుతున్నారు కాబట్టే టార్గెట్ చేశామని ప్రకటించడం.. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… తెలంగాణ సమాజంలో ఓ పొలరైజేషన్ ప్రారంభమయింది. అధికారానికి దూరమైన భావన.. తెలంగాణ రెడ్డి సమాజంలో ఉంది. దాన్ని రామారావు అనే లాయర్ తన మాటలతో మరింతగా పెంచారు. అవి రాను రాను టీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారిపోయాయి. చేయాలనుకున్నది ఒకటైతే.. జరుగుతోంది మరొకటన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
అందుకే ఐటీ దాడుల్లో కేసీఆర్ ప్రమేయం ఏమీ లేదని.. అంతా మోడీనే చేయిస్తున్నారని చెప్పుకునే ప్రయత్నాన్ని మీడియా ద్వారా టీఆర్ఎస్ వర్గాలు చేస్తున్నాయి. దానికి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనమే సాక్ష్యంగా కనిపిస్తోంది. చంద్రబాబును టార్గెట్ చేసి.. మోడీనే ఒత్తిడి చేసి మరీ ఐటీ అధికారులను రేవంత్ ఇంటిపై దాడులు చేయించారనేది ఆ కథనం సారాంశం. కానీ ఓటుకు నోటు కేసులో రూ. 50 లక్షలు ఎక్కడివనే దానిపై.. అప్పట్లో విచారణ జరిపారు. అప్పుడు తెలియని విషయాల కోసం.. మూడున్నరేళ్ల తర్వాత ఇప్పుడు తెలుసుకుంటారా..?. కథనం మొత్తం మీద… రేవంత్ రెడ్డి టార్గెట్ కాదని చెప్పడానికే ప్రయత్నించారు. విచారణ అంతా.. రేవంత్ అక్రమాస్తుల మీద ఫోకస్ కాలేదని.. కేవలం ఆ రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది. కథనం మొత్తం చూస్తే.. రేవంత్ రెడ్డి టార్గెట్ కాదని.. చంద్రబాబునే టార్గెట్ చేశారని.. అదీ కూడా మోడీ పనే కాని.. కేసీఆర్ కు ఏ సంబంధం లేదని చెప్పడానికే తాపత్రయ పడ్డారు.
రాఫెల్ స్కాంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి.. ఇరికించడానికే మోడీ.. ఐటీ దాడులు చేస్తున్నారన్న భావం కథనంలో ఉంది. కాస్త లోతుగా ఆలోచిస్తే.. ఇందులో రాజకీయం సులువుగానే అర్థమవుతోంది. జగ్గారెడ్డి పై పధ్నాలుగేళ్ల కిందటి కేసు బయటకు రావడం.. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలపై ఐటీ దాడులతో… తెలంగాణలో రెడ్డి సమాజం పార్టీలకు అతీతంగా ఏకమయ్యే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని అత్యంత తీవ్రంగా టార్గెట్ చేయడం సంచలనం అవుతోంది. నిన్నామొన్నటిదాకా ఆయనను టీడీపీ నేతగానే చూసిన వాళ్లు.. ఇప్పుడు తమ నేతగా ఓన్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి నుంచి వచ్చే డ్యామేజ్ను తగ్గించుకోవడానికి టీఆర్ఎస్ వర్గాలు… వాటితో.. కేసీఆర్కు ఏ సంబంధం చెప్పుకునేందుకు మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారనడానికి.. ఆంధ్రజ్యోతి కథనమే సాక్ష్యంలా కనిపిస్తోంది.