రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి’కి ప్రపంచ వ్యాప్తంగా అంత పేరు ప్రఖ్యాతులు రావడానికి కేవలం మార్కెటింగ్, దానికి తగ్గట్టు చేసిన పబ్లిసిటీయే కారణం అని చాలా మంది అభిప్రాయం. సినిమా చూసిన తర్వాత అప్పటివరకు రాజమౌళి చేసిన పబ్లిసిటీ గురించి ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి ‘బాహుబలి’ చిత్రంలో అద్భుతం అని చెప్పుకోవడానికి గ్రాఫిక్స్ తప్ప ఏమీ లేదు అనే విషయాన్ని అందరూ ఒప్పుకోవాలి. ఒక పక్క షూటింగ్ కోసం కష్టపడుతూనే మరో పక్క సినిమాకి ఎలాంటి హైప్ తీసుకు రావాలి అనే విషయంలో సీరియస్‌గా వున్న రాజమౌళి దానికి తగ్గట్టుగానే అన్నివిధాలుగా సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. తను చెయ్యబోయే ‘బాహుబలి’ సెకండ్ పార్ట్‌లో కథ వుంటుందని షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే చెప్పాడంటే ఫస్ట్ పార్ట్‌లో విషయం లేదని అతను ఒప్పుకున్నట్టే కదా!
మొత్తానికి ‘బాహుబలి2’ షూటింగ్ స్టార్ట్ చేసేశాడు రాజమౌళి. సెకండ్ పార్ట్‌కి సంబంధించి ఎలాంటి విషయం బయటికి వెళ్ళకూడదని యూనిట్ మెంబర్స్‌కి స్ట్రిక్ట్‌గా ఆదేశాలు జారీ చేసిన రాజమౌళి గుట్టుగా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసెయ్యాలని ఆలోచిస్తున్నాడని అందరూ అనుకున్నారు. అయితే అతని ప్రమేయం లేకుండానే సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అంటే సెకండ్ పార్ట్‌కి సంబంధించిన పబ్లిసిటీ అప్పుడే స్టార్ట్ అయిపోయిందన్నమాట. బయటికి వస్తున్న ఫోటోలు యూనిట్వారికి తెలియకుండా వస్తున్నాయా? లేక వాళ్ళే కావాలని లీక్ చేస్తున్నారా? అనే డౌట్ అందరికీ వస్తోంది. ఏది ఏమైనా రాజమౌళి సెకండ్ విజువల్ వండర్ ‘బాహుబలి2’కి సంబంధించిన దండోరా స్టార్ట్ అయిపోయిందన్నది మాత్రం నిజం.