మహబూబ్ నగర్ జిల్లాలో మహాకూటమి పొత్తుల వ్యవహారం అంత తేలిగ్గా తెగేలా కనిపించడం లేదు. అనేక స్థానాల్లో సీట్ల కేటాయింపు.. చివరికి రెబల్స్ బరిలో దిగడంతో ముగిసేలా కనిపిస్తోంది. మహబూబ్ నగర్ సీటుపై అన్ని పార్టీలు కన్నేశాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా ఎవరికి చాన్స్ ఇచ్చినా మిగతా వారు రెబల్ నామినేషన్లు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసమే ఐదుగురు నేతలు పోటీ పడుతున్నారు. ఎలాగైనా పొత్తుల్లో తమ పార్టీకే సీటు..తానే అభ్యర్థి నంటూ..ఎవరికి వారు ఊహించుకుంటూ లీకులు ఇస్తున్నారు. పాలమూరు నియోజకవర్గంలో సగం పట్టణం..సగం గ్రామీణ ప్రాంతం ఉంటుంది. రూరల్ మండలాలలో పరిమితమైన ఓట్లే ఉంటాయి. అర్బన్ ప్రాంతం మాత్రం కాంగ్రెస్కు పట్టు ఉన్న ప్రాంతం. 2009 ఎన్నికలకన్నా ముందు దాకా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా పాలమూరు నగరం ఉంది. మునిసిపాలిటీ ఒక్కసారి తప్ప ఎప్పుడూ కాంగ్రెస్ గుప్పిట్లోనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. అందుకే గెలుపు ఖాయమని అంచనా వేసుకుని.. టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబేదుల్లా కోత్వాల్ టిక్కెట్ రేసులో ముందువరసలో ఉన్నారు. మహాకూటమిలో తెలంగాణ ఇంటి పార్టీ కూడా చేరనుంది. ఈ పార్టీ ఉపాధ్యక్షులు యన్నం శ్రీనివాసరెడ్డి. మాజీ ఎమ్మెల్యే. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా పని చేసి.. తర్వాత బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2014 లో బీజేపీ నుంచి పోటీచేసి తక్కువ తేడాతోనే ఓడిపోయారు. తర్వాత బీజేపీకి దూరమయ్యారు. ఇపుడు పాలమూరు నుంచే తాను పోటీచేయడం ఖాయమని ప్రకటిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు..బీసీ వర్గాల నేత..జడ్చర్ల మాజీ శాసన సభ్యుడు ఎర్రశేఖర్ ఈ సారి తెలుగుదేశం నుంచే పొత్తుల్లో భాగంగా మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీచేసేందుకు సన్నద్ధమయ్యారు. పొత్తుల్లో భాగంగా సీటు రాకపోతే.. ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానంటున్నారు.
ఇక కోదండరాం కూడా మహా కూటమిలో కలవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణా జన సమితి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జ్ రాజేందర్ రెడ్డి కూడా పాలమూరు నుంచి పోటీచేయడం ఖాయమని తెగేసి చెబుతున్నారు. జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులుగా ఉన్న రాజేందర్ రెడ్డి గత ఎన్నికల తర్వాత తాజా మాజీ శ్రీనివాస్ గౌడ్ కు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు. ఇలా అందరూ హేమాహేమీలే టిక్కెట్ రేసులో ఉండటంతో.. కాంగ్రెస్ ఆశావహులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. అందుకే మహబూబ్ నగర్ స్థానాన్ని మాత్రం ముందు పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు పోకుండా.. చూసుకునేందుకు అందరూ ఢిల్లీ బాట పడుతున్నారు.