ఎంత కాదన్నా దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ది షిప్. అన్నీ తన కనుసన్నల్లోనే జరగాలి. దర్శకుడి మాటే శిరోధార్యం. కాకపోతే.. సినిమా అనేది టీమ్ ఎఫెక్ట్ కూడా. అందరినీ కలుపుకుపోగలిగే నేర్పు దర్శకుడికి ఉండాలి. ఎవరైనా సలహాలూ సూచనలు ఇస్తే తీసుకునే ఓపిక కూడా ఉండాలి. స్టార్ డమ్ అనుభవిస్తున్న కొంతమంది దర్శకులు మాత్రం వన్ మాన్ ఆర్మీలా తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటారు. చుట్టు పక్కల వాళ్లకు సలహాలు ఇచ్చేంత దమ్ము, ధైర్యం.. చనువు ఉండవు కూడా. త్రివిక్రమ్ కూడా అదే టైపు. తనే కథ, మాటల రచయిత కాబట్టి తాను తీసిందే ఫైనల్. దాన్ని యధావిధిగా వెండి తెరపై తీసుకొచ్చేస్తాడంతే. ఫ్లాప్, హిట్.. ఇలా క్రెడిట్ ఏదైనా సంపూర్ణంగా తన ఖాతాలోనే పడుతున్నప్పుడు.. ఆ మాత్రం ఒంటెద్దు పోకడ తప్పు కాదు. కాకపోతే జడ్జిమెంట్ మిస్సయ్యే ప్రమాదం ఉంది. ఆ ఎఫెక్ట్ ‘అజ్ఞాతవాసి’లోనూ కనిపించింది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడం త్రివిక్రమ్‌ని కాస్త వెనక్కి తగ్గేలా చేసిందని టాలీవుడ్ టాక్. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రానికి త్రివిక్రమ్ ఎంచుకుంటున్న మార్గాలు, అవలంభిస్తున్న విధానాలు చూసి `త్రివిక్రమ్ మారాడు` అని ఆయన సన్నిహితులే చెబుతున్నారు.
తన సినిమాకి సంబంధించిన ఫైనల్ నిర్ణయం ఎప్పటికీ త్రివిక్రమ్ దే. ఆ విషయంలో నిర్మాతలు, హీరోల మాట కూడా వినడు. `అరవింద సమేత` విషయంలో మాత్రం ఎన్టీఆర్, నిర్మాత రాధాకృష్ణ నిర్ణయాలూ పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఆడియో విడుదల తేదీ, టీజర్, ట్రైలర్.. ఇలాంటి విషయాల్లో ఎన్టీఆర్ మాటే చెల్లుబడి అయ్యిందని టాక్. అంతేకాదు… ఈసారి స్క్రిప్టు విషయంలోనూ త్రివిక్రమ్ చాలామంది సలహాలు తీసుకున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ‘నో’ అన్న సీన్ ఏదీ…. ‘అరవింద’లో లేదని… విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఇద్దరికీ నచ్చిన సీన్లే ఓకే అయ్యాయని.. స్క్రిప్టులో ఎన్టీఆర్ జోక్యంగా బాగానే కనిపించిందని టాక్. ఈసారి త్రివిక్రమ్ బృందంలోని సహాయ దర్శకులకీ పని పడిందని, ఇదంతా ‘అరవింద’కు ప్లస్‌గా మారిందని తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో ని హైటెక్స్‌లో అరవింద సమేత ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.