‘సైరా’కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులోని ఓ యాక్షన్ ఎపిసోడ్‌కి రూ.50 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. అక్కడే ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తున్నారని, అందుకోసం విదేశీ ఫైట్ మాస్టర్లు కూడా పనిచేస్తున్నారని చెబుతున్నారు. జార్జియాలో యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నమాట వాస్తవమే. అయితే… ఆ అంకెలు మాత్రం నిజం కాదు. ‘సైరా’లో నాలుగు యుద్ధ సన్నివేశాలున్నాయి. తొలిసగంలో రెండు, ద్వితీయార్థంలో రెండు కనిపిస్తాయి. ఈ నాలుగు యాక్షన్ సన్నివేశాల బడ్జెట్ రూ.50 కోట్లు. ఒక్క జార్జియాలోనే ఆ రూ.50 కోట్లు ఖర్చు పెట్టేస్తే ఎలా?? సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు. అందులో చిరంజీవి పారితోషికమే రూ.30 కోట్లు వేసుకున్నారు. అంటే.. రూ.170 కోట్లలో ఈసినిమా పూర్తి చేయాలన్నమాట.
జార్జియాలో పెద్ద పెద్ద కోటలున్నాయి. అవి ‘సైరా’ కథకు అనుకూలంగా కనిపించాయి. జార్జియాలో భారీ సెట్లు వేసే అవసరం తప్పింది. ఆ విధంగా జార్జియాలో ‘సైరా’ తెరకెక్కించడం వల్ల సైరాకి ఓ విధంగా ఖర్చు తగ్గినట్టే. ఇక్కడి నుంచి జూనియర్ ఆర్టిస్టుల్ని తీసుకెళ్లే అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడి పౌరుల్ని బ్రిటీష్ సైన్యంగా ఉపయోగించుకోవొచ్చు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ఇదే చేశారు. దాదాపు 40 శాతం చిత్రీకరణ జార్జియాలో జరిగింది. రూ.10 కోట్లలోపే ఖర్చు పెట్టారు. ఇప్పుడు `సైరా` విషయంలోనూ అదే జరుగుతోంది. అంతేగానీ ఒకే సన్నివేశానికి రూ.50 కోట్లు అనే వార్తలో మాత్రం నిజం లేదు.