`ఎన్టీఆర్` బయోపిక్ శరవేగంగా సాగుతోంది. చిన్న చిన్న బ్రేకులు మినహాయిస్తే.. నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతున్నట్టే. ప్రస్తుతం నాలుగు రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఈలోగా దర్శకుడు క్రిష్ లొకేషన్ల వేటలో పడ్డాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో కొన్ని ప్రత్యేకమైన సెట్లు తీర్చిదిద్దారు. ఇండోర్‌కి సంబంధించినంత వరకూ షూటింగ్ ఇందులోనే జరుగుతోంది. అవుడ్డోర్ షూటింగ్ కోసం క్రిష్ లొకేషన్లను వెదుకుతున్నారు. నిమ్మకూరు నేపథ్యంలో తెరకెక్కించాల్సిన సన్నివేశాల్ని తూర్పు గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరులో ప్లాన్ చేశారు క్రిష్. ప్రస్తుతం క్రిష్ తూర్పు గోదావరి జిల్లా వెళ్లారు. అక్కడ కొన్ని పల్లెటూర్లలో రెక్కీ నిర్వహిస్తున్నారు. ఎన్.బి.కె సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్, రానా కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరోవైపు `ఎన్టీఆర్` బయోపిక్‌ని రెండు భాగాలుగా తీర్చిదిద్దుతున్నారన్న వార్తలొస్తున్నాయి. తొలి భాగంలో సినిమా ప్రయాణం, రెండో భాగంలో రాజకీయ ప్రయాణంచూపిస్తారని టాక్. రెండో భాగాన్ని సరిగ్గా ఎన్నికల ముందు విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. వీటిపై మాత్రం చిత్రబృందం మౌనం వహిస్తోంది.