వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. పార్టీని నమ్ముకున్న వాళ్లని.. విధేయంగా ఉన్న వాళ్లని గురి చూసి కొడుతున్నారు. చిలుకలూరి పేట మర్రి రాజేశేఖర్, పాయకరావుపేట గొల్ల బాబూరావు లాంటి వాళ్ల హడావుడి సద్దుమణగక ముందే.. ఈ సారి ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త లేళ్ల అప్పిరెడ్డికి షాక్ ఇచ్చారు. ఉన్న పళంగా ఆయనను తొలగించేసి.. నాలుగు రోజుల కిందట పార్టీలో చేరిన మాజీ పోలీసు అధికారి ఏసురత్నంకు … నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చేశారు. ఇలా చేసే ముందు లేళ్ల అప్పిరెడ్డి కనీస మాట మాత్రంగా కూడా చెప్పలేదు. దీంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. అభిమానుల అభిప్రాయాలు తెలుసుని దానికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రకటించారు.
లేళ్ల అప్పిరెడ్డి.. కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి జగన్ తో సన్నిహితంగా ఉన్నారు. ఆయన పార్టీ పెట్టడంతో.. ఆయనతో పాటే వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ గెలుపొందలేకపోయారు. నాలుగేళ్లుగా ఆయన పశ్చిమ నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తనకే టిక్కెట్ వస్తుందన్న అంచనాతో ఉన్నారు. కానీ హఠాత్తుగా జగన్ ప్లాన్ మార్చేసుకున్నారు. అప్పిరెడ్డికి షాక్ ఇచ్చారు. నిజానికి.. గుంటూరు పశ్చిమ స్థానం నుంచి పోటీ చేయాలని.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు.. కిలారు రోశయ్య లాబీయింగ్ చేసుకుంటున్నారు. కానీ జగన్… కిలారు రోశయ్యకు గుంటూరు పార్లమెంట్ ఇచ్చారు. గుంటూరు పార్లమెంట్ స్థానంలో పని చేసుకుంటున్న విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయలును నరసరావుపేటకు మార్చారు. దీంతో అప్పిరెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆయన రాజకీయ భవిష్యత్ ఊపిరి తీసే నిర్ణయాన్ని జగన్ వారంలోపలే తీసుకున్నారు. ఏసురత్నాన్ని సమన్వయక్తర్తగా నియమించేశారు.
లేళ్ల అప్పిరెడ్డి జీవితాశయం ఎమ్మెల్యే కావడం. ఎమ్మెల్యే ఆయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆయన శపథం చేశారు. ఆయన లక్ష్యాన్ని సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న సమయంలో జగన్ షాక్ ఇవ్వడంతో ఆయన హతాశులయ్యారు. అభిమానులతో చర్చించి.. నాలుగు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు. జగన్ తీరుతో.. ఏపీలో ఏ ఒక్క వైసీపీ నేత కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు.