ఉమ్మడి హైకోర్టును ఉన్న పళంగా విభజించాలనే ఆత్రం.. కేంద్ర ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో కేంద్రం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడున్న భవనంలో కానీ వేరే భవనాల్లో ఏపీ, తెలంగాణకు హైకోర్టులు..ఎందుకు ఏర్పాటు చేయకూడదంటూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు ఏపీ భూభాగంలోనే ఉండాలని గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కొట్టి వేయాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కేంద్రం తీరుపై ఏపీ రాజకీయ నేతల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇంత కాలం.. ఈ విషయంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ చేతుల్లోనే ఉందని చెప్పుకొచ్చిన కేంద్రం.. సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చే సరికి మాత్రం.. మొత్తం ప్లేట్ తిప్పేశారు.
ఉన్న పళంగా రెండు రాష్ట్రాలకు హైకోర్టులు ఏర్పాటు చేయాల్సిందేనన్నట్లుగా వాదిస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం.. భవనాలు నిర్మిస్తున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది. హైకోర్టు భవనం ఎప్పటికి సిద్ధమవుతుందని ఈ కేసు విచారిస్తున్న జస్టిస్ ఎకె సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. డిసెంబర్ నాటికి భవనం సిద్ధమవుతుందని ఎపి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే మూడేళ్లుగా ఇదేమాట చెబుతున్నారని కేంద్రం, తెలంగాణ తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. భవనం ఎప్పటికి సిద్ధమవుతుందో అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఎపిని ఆదేశించింది. దీని కోసం రెండు వారాల గడువునిచ్చింది.
హైకోర్టు విషయంలో కేంద్రం అత్యుత్సాహం … బలపడుతున్న టీఆర్ఎస్, బీజేపీ బంధానికి సూచికగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత కాలం… హైకోర్టు విషయంలో పార్లమెంట్ లో కూడా.. కేంద్రం ఎప్పుడూ తమ బాధ్యత తీసుకోలేదు. అంతా ఏపీ చేతుల్లోనే ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పుడూ అదే చెబుతోంది… కానీ ఇప్పటికప్పుడు విభజించాలన్నట్లుగా వాదనలు వినిపిస్తోంది. ఏపీలో హైకోర్టు భవన నిర్మాణాలను నిధులు కేటాయించే అవకాశం లేదని.. కొద్ది రోజుల కిందట.. సుప్రీంకోర్టులోనే దాఖలు చేసిన.. ఓ అఫిడవిట్ లో కేంద్రం చెప్పింది. కొత్త హైకోర్టు భవన నిర్మాణం సాయం విషయంలో పూర్తిగా వెనుకడుగు వేస్తున్న కేంద్రం..ఖర్చు లేకుండా హైకోర్టు విభజన మాత్రం జరిగిపోవాలని తెలంగాణ కన్నా ఎక్కువగా తాపత్రయపడిపోతోంది.