కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చెయ్యడం, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. ఈనెల 3న ఆయన ఐటీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈ ఐటీ దాడుల నేపథ్యంలో రాజకీయంగా దీనిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లకుండా రేవంత్ ను అడ్డుకోవడం అనేది ఒక వ్యూహమైతే, దీన్లో భాగంగా ఓటుకు నోటు కేసుపై కూడా కొంత కదలిక తీసుకొచ్చి, ఏపీలో టీడీపీని కూడా ప్రభావితం చెయ్యొచ్చనే మరో కోణం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ నేతల మధ్య ఆఫ్ ద రికార్డ్ ఆసక్తికరమైన చర్చ జరిగినట్టు సమాచారం!
రేవంత్ రెడ్డి మీద ప్రభుత్వం మరీ అత్యుత్సాహం ప్రదర్శించి, ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్టుల వరకూ వెళ్తే… కాంగ్రెస్ కి మరో పది సీట్లు పెరగడం ఖాయమని ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది! రేవంత్ రెడ్డిపై ఏరకమైన చర్యలకు వెళ్లినా… అది ఎమోషనల్ అంశంగా మారే అవకాశం ఉంటుందనే ఒక నేత అన్నారు! ఇప్పటికే రేవంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనీ, కాబట్టి దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది ప్రభుత్వ పెద్దలకీ కొంత అంచనా ఉంటుందనే వ్యాఖ్యానాలు కూడా ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ అంశం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రముఖ సామాజిక వర్గాన్ని మరింత ఐక్యం చెయ్యడానికి పనికొచ్చిందనే విశ్లేషణలూ వినిపిస్తూ ఉండటం విశేషం.
గతంలో, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలా రాజకీయంగా ఆ సామాజిక వర్గంపై ఈ తరహాలో కక్ష సాధింపు చర్యలు ఎక్కడా జరగలేదన్న అంశం కూడా నేతల మధ్య ప్రస్థావనకు వచ్చిందట! రాజకీయంగా వైరుద్ధ్యాలనేవి అంశాల ప్రాతిపదికన మాత్రమే ఉండేవే తప్ప… వ్యక్తిగతంగా కొంతమంది నేతల్ని టార్గెట్ చేసుకోవడం అనేది తెరాస హయాంలో పెరిగిందనే అభిప్రాయమూ వారి మధ్య చర్చకు వచ్చిందని తెలిసింది. సో… రేవంత్ పై తాజా ఐటీ దాడులను కాంగ్రెస్ ఇలా విశ్లేషిస్తోంది. పూర్తిగా రాజకీయ ప్రేరేపిత ఉద్దేశాల నేపథ్యంలోనే ఇదంతా జరుగుతోందన్న యాంగిల్ లోనే చర్చలు జరుగుతూ ఉండటం విశేషం. వాస్తవానికి, తాజా దాడుల్లో తెరాస ప్రభుత్వం చేయించినట్టుగా సాంకేతికంగా కనిపించకపోయినా… ఈ అంశాన్ని రాజకీయంగానే కాంగ్రెస్ చూస్తోంది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే క్రమంలోనే విశ్లేషించి, వ్యూహాలను సిద్ధం చేస్తోందన్నది వాస్తవం.