వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఓ రకంగా తన పార్టీలో ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పాత సమన్వయకర్తలందర్నీ తీసి పడేసి.. కొత్త వాళ్లను తీసుకొస్తున్నారు. వాళ్ల అర్హత డబ్బులా..? లేక సమర్థతా..?లేక నియోజకవర్గంలో ఉన్న పట్టా..? అన్నది తర్వాత విషయం… మొత్తానికి సమన్వయకర్తల్ని మాత్రం ఎక్కడికక్కడ… మార్చి పడేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో ఇటీవలి కాలంలో అంటే… గత మూడు, నాలుగు నెలల కాలంలోనే కనీసం.. 40 చోట్ల సమన్వయకర్తల్ని మార్చేశారు. అందులో… మర్రి రాజశేఖర్ అనే సీనియర్ తో పాటు.. వంగవీటి రాధాకృష్ణ లాంటి.. సామాజికవర్గ బలం ఉన్న నేతలు కూడా ఉన్నారు. మరికొంత మందిని మార్చేయబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
ఇలా.. ఒక్కో నేతని సమన్వయకర్తగా మార్చే పరిస్థితి వచ్చినప్పుడు… కొంత మంది వెళ్లి… ఆ నేతను..” తొందర పడవద్దు..” అని చెప్పి వెళ్తున్నారు. అందరూ గుంపుగా రావడం లేదు. ఒకరి తర్వతా ఒకరు వచ్చి..ఈ డైలాగె చెప్పి వెళ్తున్నారు. వైసీపీ చిలుకలూరి పేట సమన్వయకర్తగా ఉన్న మర్రి రాజశేఖర్ ను.. తీసేసి.. విడదల రజనీ అనే ఎన్నారై సౌండ్ పార్టీని నియమించారు. మర్రి రాజశేఖర్ అసంతృప్తికి గురయ్యారని ప్రచారం జరగింది. జగన్ నుంచి కానీ.. ఇతర అగ్రనేతల నుంచి కానీ.. మర్రి రాజశేఖర్ కు ఒక్క బుజ్జగింపు రాలేదు. కానీ జిల్లా నేతలు మాత్రం వారానికొకరు చొప్పున వచ్చి… జగన్ తో అన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం.. ” తొందర పడవద్దు..” అని చెప్పి వెళ్తున్నారు. అలా చెప్పిన వెళ్లిన వాళ్లలో లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు.. ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఉన్నారు. కావటి మనోహర్ నాయుడు ఉన్నారు. వీరంతా పై నుంచి చెబితే వచ్చారో.. లేక వాళ్లే వచ్చారో తెలియదు కానీ.. వీళ్లందర్నీ మళ్లీ.. అలాగే… సముదాయించాల్సిన పరిస్థితి వచ్చింది. అందరి సమన్వయకర్తల పదవికి ఎసరొచ్చి పడింది.
ఇక విజయవాడ సెంట్రల్ సీటుకు.. వంగవీటి రాధాకృష్ణకు ఇవ్వరని తేలిపోయిన తర్వాత పార్థసారధి, కొడాలి నాని వంటి వాళ్లు వచ్చి..” తొందర పడవద్దు..” అని చెప్పి వెళ్లారు కానీ.. ఆయన పార్టీ పరంగా ఏమైనా ఇచ్చేవాళ్లు కనిపించలేదు. ఆయన కూడా తొందర ఎందుకులే అని సైలెంట్ గా ఉండిపోయారు. నిజానికి.. జగన్ .. సమన్వయక్తలుగా వారిని తొలగించి వేరేవారిని నియమిస్తున్నప్పుడు కనీస సమాచారం కూడా ఉండటం లేదు. ఆ బాధలో ఉంటే.. మిగతా వాళ్లు వచ్చి.. ” తొందర పడవద్దు..” అని చెప్పి వెళ్తారు కానీ.. జగన్ తరపున నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాదు. అంటే.. ఇలా ” తొందర పడవద్దు..” అని చెప్పేవాళ్లంతా.. త్వరగా వెళ్లిపో అనే అర్థంలో సందేశం తీసుకొస్తున్నారనే విషయం చాలా మందికి అర్థం కావడం లేదు. అర్థం అయినా ప్రత్యామ్నాయం లేక తమ టైమ్ కోసం ఎదురు చూస్తున్నారు.