వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీకి అనూహ్యమైన ఆదరణ లభించడం ఖాయం అనే ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత, ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ సోము వీర్రాజు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఏపీ భాజపా నేతలు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో అనుసరించాల్సిన వ్యూహంపై దాదాపు మూడు గంటలపాటు నేతలతో అమిత్ షా చర్చించారు. రాష్ట్రంలోని లోక్ సభ స్థానాలను 8 క్లస్టర్లుగా విభజించి, ఆ పరిధిలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలనే వ్యూహం ఖరారు చేసినట్టు సమాచారం. ఏపీలోని లోక్ సభ, శాసన సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ అమిత్ షా దిశా నిర్దేశం చేశారంటూ అనంతరం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీని కేవలం 30 స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తామని వీర్రాజు అన్నారు. భాజపా పేరు వింటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వణుకు పుడుతోందన్నారు. అందుకే, ఆయన తెల్లారి లేచింది మొదలు మోడీ జపం చేస్తుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పొట్టవిప్పితే అబద్ధాలు, అవినీతి మాత్రమే ఉంటాయని విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షుడి సూచనల మేరకు ఏపీలో భాజపా పకడ్బందీ వ్యూహ రచన చేస్తోందన్నారు! అయితే, ఆ వ్యూహం ఏంటనేది మాత్రం బయటకి చెప్పరట! అమిత్ షా చేసిన సూచనల్ని ఇప్పుడే బయటకి చెప్పలేమనీ… క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసి, ఫలితాలు సాధించి చూపిస్తామని వీర్రాజు అన్నారు.
టీడీపీకి ఆ 30 స్థానాలైనా ఎందుకూ, ఒక్కటి కూడా దక్కదని అనేస్తే సరిపోతుంది కదా! ఢిల్లీలో కూర్చుని ఏపీ విషయమై భాజపా కంటున్న కలలు ఇలా ఉన్నాయి. ఆంధ్రాలో భాజపా బలపడాలంటే రహస్య వ్యూహాలు, ఎత్తుగడలూ పని చెయ్యవు! పనిచేసేది ఒక్కటే… విభజన చట్టంలో హామీలను అమలు చేయడం, ఏపీకి భాజపా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడటం. ఈ పని చేస్తే భాజపాకి ఆదరణ లభిస్తుంది. విచిత్రం ఏంటటే… ఈ అంశం భాజపా ఎన్నికల వ్యూహరచన సమావేశంలో చర్చకు రాకపోవడం! ఇంకా దారుణమైన అంశం ఏంటంటే… ఆంధ్రా నేతలు ఈ అంశాలను చర్చకు పెట్టకపోవడం, అవే ప్రాధాన్యతాంశాలని పట్టు పట్టకపోవడం. ఆంధ్రాలో భాజపాపై వ్యతిరేకత ఎందుకు పెరుగుతోందన్న ఒక్క అంశాన్ని ఢిల్లీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా లేదు. రాష్ట్ర నేతలు కూడా ఆ తీవ్రతను అధిష్టానానికి నివేదిస్తున్నట్టూ లేదు. కేవలం టీడీపీని వైరి వర్గంగా చూస్తున్నారే తప్ప… ఏపీ ప్రజల కోణం నుంచి భాజపాపై రోజురోజుకీ పెరుగుతున్న వ్యతిరేకతను పరిగణిస్తున్నట్టు లేదు. అదే వాస్తవిక దృక్పథం భాజపాకి ఉండి ఉంటే… ఇలా రహస్య అజెండాలు వీర్రాజు మాట్లాడరు కదా!