జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఇటీవల కాలంలో పశ్చిమగోదావరి లో కొన్ని బహిరంగ సభలు జరపడం, ఆ సందర్భంలో తన హత్యకు కుట్ర జరుగుతోందని ప్రకటించడం, అలాగే సమస్యలు తెలుసుకోవడానికి కొల్లేరు ప్రాంతానికి వెళుతుండగా కొంతమంది గ్రామ పెద్దలు, పవన్ కళ్యాణ్ సభ కి వెళ్తే గ్రామస్తులకు 50 వేల జరిమానా అంటూ ప్రకటించడం, తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ రహస్య పూజలు నిర్వహించారు అంటూ మీడియాలో ఇటీవల వార్తలు రావడం కూడా తెలిసిందే. అయితే ఈ మూడు సమస్యల విషయంలో కూడా, మీడియా వాటిని చూపించిన లేదా రాసిన విధానం చూస్తుంటే, మీడియా గురి తప్పిందా అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ని డ్యామేజ్ చేయడానికి మీడియా చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టి, అవి పవన్ కళ్యాణ్ కి మరింత సానుభూతి తెచ్చిపెడుతున్నాయి అని కొన్ని విశ్లేషణలు తెర మీదకు వస్తున్నాయి.
కొల్లేరు పర్యటన:
పవన్ కళ్యాణ్ కొల్లేరు పర్యటన సజావుగానే జరిగినప్పటికీ, పర్యటనకు ముందు కాస్త ఉద్రిక్తత నెలకొంది. పవన్ కళ్యాణ్ పర్యటనకు గ్రామస్తులు వెళితే, 50 వేల జరిమానా విధిస్తామంటూ కొందరు గ్రామ పెద్దలు తీర్మానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త ని మీడియా ఎలా కవర్ చేసి ఉండాల్సింది? ” ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చు, గ్రామస్తులు కూడా ఎవరికైనా సమస్యలు చెప్పుకోవచ్చు, అలాంటప్పుడు జరిమానా విధించడానికి ఈ గ్రామ పెద్దలు ఎవరు?, ఇంకా మనం భూస్వామ్య కాలం లో ఉన్నామా?” అని ప్రశ్నించాల్సిన అవసరం , బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా పై ఉంది. కానీ వారు ఎలా కవర్ చేశారంటే,” పవన్ కళ్యాణ్ కి షాకిచ్చిన గ్రామ పెద్దలు” తరహా కథనాలతో, ఒక రాజకీయ ప్రత్యర్థి తరహా వ్యాఖ్యలు చేస్తూ ఈ వార్తను విశ్లేషించారు. సహజంగా ఇది మీడియా పై ఉన్న గౌరవాన్ని తగ్గించేదే.
రహస్య పూజలు అంటూ కథనాలు:
పవన్ కళ్యాణ్ రహస్య పూజలు నిర్వహిస్తున్నారు అంటూ, గతంలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ క్షుద్ర పూజలు కూడా చేశాడు అని చెప్పిన వ్యాఖ్యలకు ముడిపెడుతూ, మీడియా లో కథనాలు వచ్చాయి. దీనిమీద జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ స్పందిస్తూ, అవి రహస్య పూజలు కావని, బ్రహ్మ ముహూర్తం లో జరిగిన మామూలు పూజ లేనని, బ్రహ్మ ముహూర్తంలో జరిపినంత మాత్రాన అవి రహస్య పూజలు గా ఎలా చిత్రీకరిస్తారని అన్నారు. గతంలో ఎన్టీఆర్, ఇప్పట్లో చంద్రబాబు , బాలకృష్ణ కూడా ఆ ముహూర్తం లో పూజలు చేస్తూనే ఉంటారు అని, తమ మీద అసత్య ప్రచారాలు చేయడం మానుకొని, మీడియా ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని హితవు చెప్పారు. ఇది కూడా మీడియా తీరుపై ప్రజలలో మరొకసారి సందేహాలు కలిగించింది.
హత్యకు కుట్ర వ్యాఖ్యలని శ్రీరెడ్డి వ్యాఖ్యలతో ముడిపెట్టిన విశ్లేషణలు:
పవన్ కళ్యాణ్ తన మీద కొంత మంది ఎమ్మెల్యేలు హత్యకు కుట్ర చేస్తున్నారని ప్రకటించిన తర్వాత, పవన్ కళ్యాణ్ పై టిడిపి నేతలు విరుచుకుపడ్డారు. అలాగే గతంలో శ్రీ రెడ్డి పదేపదే మీడియాలో కనిపిస్తూ, తనకు అన్యాయం జరిగిందని , తనకు న్యాయం చేసేంత వరకూ తాను పోరాటం కొనసాగిస్తానని మీడియా లో కూర్చొని వ్యాఖ్యలు చేస్తుండగా, అసలు ఈ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేని పవన్ కళ్యాణ్ ని, అందులోకి లాక్కొని వచ్చి, పవన్ కళ్యాణ్ స్పందించాలి స్పందించాలి అంటూ ఒత్తిడి పెంచే క్రమంలో, పవన్ కళ్యాణ్ స్పందిస్తూ శ్రీరెడ్డిని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య మీద శ్రీరెడ్డి అగ్గిమీద గుగ్గిలం కావడం, మాట అదుపు జారి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, తదనంతర పరిణామాలు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర అంటూ వ్యాఖ్యలు చేయగానే, కొన్ని మీడియా డిబేట్ లలో విశ్లేషకులు , యాంకర్లు, పవన్ కళ్యాణ్ శ్రీ రెడ్డి కి చెప్పిన సలహాలు తాను పాటించాలని, ఆ కుట్ర గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చిన్న తేడా ఏంటి అంటే, శ్రీ రెడ్డి తనకు అన్యాయం జరిగింది అంటూ పదేపదే మీడియాలో కనిపిస్తూ, తనకు న్యాయం చేయండి అని పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలి మొర్రో అని కానీ, ప్రభుత్వం తక్షణం ఇందులో కలుగజేసుకోవాలి అని గాని వాపోలేదు. ఇలా జరిగింది అని ప్రజలకు చెబుతూ, దీన్ని తాను ఎదుర్కోగలను అని మాత్రమే చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటి తీవ్రమైన అభియోగాలు ఒక రాజకీయ పార్టీ నాయకుడి నుంచి వచ్చినప్పుడు కూడా, మీడియా ఒక రాజకీయ ప్రత్యర్థి లాగా పాత విషయాలకు వీటిని ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం సమంజసంగా కనిపించలేదు.
ఇదిలా ఉండగా, పోలవరం పర్యటనలో ఒక నడి వయస్కురాలు అయిన మహిళ పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ, ” మీరు చేసే మంచి పనులన్నీ ఈ మీడియా చూపించడం మానివేశారు, కేవలం మిమ్మల్ని తిట్టడానికి మీడియా ప్రాధాన్యత ఇస్తోంది” అంటూ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఫై మీడియా ప్రవర్తిస్తున్న తీరును మారుమూల గ్రామాలలోని అంతగా విద్యావంతులు కానీ మహిళలు సైతం అర్థం చేసుకున్నారని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే, మీడియా ప్రవర్తిస్తున్న తీరు వల్ల పవన్ కళ్యాణ్ మీద ప్రజల్లో సానుభూతి పెరుగుతోందే తప్ప పవన్ కళ్యాణ్ కి డ్యామేజ్ కావడం లేదు అని అర్థమవుతోంది.
అలాగే, రాజకీయాలని టీవీ లోని రియాలిటీ షో తో పోల్చి చూడడం సబబు కాదు కానీ, ప్రజల మనస్తత్వాలని పరిశీలించడానికి ఒక ఉపమానం లాగా చూస్తే, ఇలా సింపతి పెరగడం బిగ్ బాస్ షోలో కౌశల్ కి ఏ విధంగా లాభించిందో, చాలామందికి స్పష్టంగా అర్థమైంది. ఒకసారి అలాంటి సింపతి గట్టిగా ఏర్పడ్డాక, తన నిజమైన మిస్టేక్స్ కూడా ఎంతగా చూపించినప్పటికీ ప్రజలు వాటిని పట్టించుకోరు అని అర్థమవుతోంది. మీడియా పవన్ కళ్యాణ్ మీద వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే, అది పవన్ కళ్యాణ్ మీద ప్రజలకు సింపతి తెచ్చేలా ఉందే తప్ప, పవన్ కళ్యాణ్ నిజమైన పొరపాట్లను ఎత్తిచూపేలా లేదు. కాబట్టి మీడియా పవన్ కళ్యాణ్ విషయంలో గురి తప్పుతోందని భావించాల్సి వస్తోంది.