మూడు నాలుగు రోజుల క్రితం మంథని అనే నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ పై ఓ ఫిర్యాదు కలకలం రేపింది. ఆయన ఎమ్మెల్యే అయిన నాలుగేళ్ల కాలంలో రూ. 900 కోట్లు ఆస్తులు కూడబెట్టారని.. డాక్యుమెంట్లతో సహా ఆ ఫిర్యాదు ఉంది. ఇక రేవంత్ రెడ్డి తరహాలో.. ఆయన ఇళ్లపై దాడులు జరుగుతాయేమోనని అందరూ అనుకుంటున్నారు. కానీ దాడులు జరగడం ఖాయమే కానీ.. అది పుట్ట మధుపై కాదు.. ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు పైన..! ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ పోలీసులు టీజర్ రిలీజ్ చేసేశారు. ఓ పాత కేసుకు సంబంధించిన… ఫైల్ దుమ్ము దులిపారు.
కొన్నాళ్ల క్రితం… దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై.. ఓ టీఆర్ఎస్ నాయకుడు.. ఓ కేసు నమోదు చేశాడు. పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామానికి చెందిన కిషన్‌రెడ్డి అనే టీఆర్ఎస్ నేత తనను గంజాయి కేసులో ఇరికించడం కోసం సుదర్శన్ అనే కాంగ్రెస్ కార్యకర్తకు శ్రీధర్‌బాబు సాయం చేశాడనేది ఆ కేసులో ఆరోపణ. ఈ అంశంపై శ్రీధర్‌బాబుతో జరిపిన ఫోన్ సంభాషణ మొత్తాన్ని సుదర్శన్ తన ఫోన్లో రికార్డు చేసి ఉంచాడు. ఇది తెలిసిన కిషన్‌రెడ్డి ఆ రికార్డును సంపాదించి హైదరాబాద్ చిక్కడపల్లిలో నివాసం ఉంటున్నందున అక్కడి పోలీసుస్టేషన్లో శ్రీధర్‌బాబుపై కేసు పెట్టారు. అప్పుడే కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఈ సంభాషణ ఆడియో శ్రీధర్బాబుదేనేనా? లేక మరెవరిదైనానా? తేల్చి చెప్పాలంటూ పోలీసులు ల్యాబ్ కు పంపారు. మర్చిపోయారు.
ఇప్పుడు ముందస్తు ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ నేతలపై కేసులకు సంబంధించి ప్రత్యేక బృందాలు ఏర్పాయినట్లుగా పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇప్పుడు శ్రీధర్ బాబు కేసు కూడా.. పోలీసులకు గుర్తుకు వచ్చింది. తాము ఎప్పుడో అడిగిన ఆ నివేదిక సంగతి ఏమైందో చెప్పాలంటూ ఇప్పుడు మళ్లీ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను పోలీసులు సంప్రదించారు. దీంతో పాత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక ఈ నివేదిక తీసుకుని.. కాస్త హడావుడి చేసి.. శ్రీధర్ బాబును ఆత్మరక్షణలో పడేసి.. పుట్ట మధుని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించడం వరకూ.. ఈ ఎపిసోడ్ జరగొచ్చన్న అనుమానాలు కాంగ్రెస్‌లో ప్రారంభవుతున్నాయి.