రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ.. ఢిల్లీ బాట పట్టిన రైతులపై గాంధీ జయంతి రోజే లాఠీ విరిగింది. డిమాండ్లతో… వెల్లువలా తరలి వచ్చిన రైతుల్ని.. కంట్రోల్ చేయడానికి లాఠీలు ఝుళిపించారు. బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. వాటర్ క్యానన్లతో తరిమికొట్టారు. కిసాన్ క్రాంతి ర్యాలీ పేరుతో.. రైతులు వేల సంఖ్యలో ఢిల్లీకి వచ్చారు. అనుమతి లేదంటూ ఘజియాబాద్ దగ్గర రైతుల ర్యాలీని వాటర్కెనాన్లతో ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లతో రహదారులను మూసివేశారు. రుణమాఫీ, మద్దతు ధర, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ…భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో రైతుల ర్యాలీ జరిగింది. గతంలో మహారాష్ట్రలో జరిగినట్లుగా… ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 23న హరిద్వార్ నుంచి కిసాన్ క్రాంతి పాదయాత్ర ప్రారంభమయింది.
ఢిల్లీలోకి అడుగుపెట్ట నీయకుండా పోలీసులు రైతులపై ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయారు. ఘజియాబాద్, ఘాజీపూర్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో పోలీసుల్ని మోహరింపచేశారు. అణచి వేసే ప్రయత్నాలను రైతులు ధీటుగా ఎదుర్కొన్నారు. ఎంత కట్టడి చేసిన మహా పాదయాత్రను విరమించేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్‌కు చేరుకునే వరకు తమ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని రైతులు చెబుతున్నారు. పరిస్థితి దిగజారుతూండటంతో రైతుల ప్రధాన డిమాండ్లలో కొన్నింటిని కేంద్రం అంగీకరించింది, మొత్తం డిమాండ్లపై హామీ ఇచ్చే వరకు పాదయాత్ర విరమించేది లేదని రైతులు చెబుతున్నారు. తూర్పు ఢిల్లీలో 144 సెక్షన్ ను అమలు చేశారు. పాదయాత్ర కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. మీరట్ జాతీయరహదారి పైకి వాహనాలను పూర్తిగా నియంత్రించారు.
రైతుకు రెట్టింపు ఆదాయం తెచ్చి పెడతామన్న కేంద్రం హామీని నమ్మి నట్టేట ముగిసిన రైతులు.. ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి సేకరించిన పంటకు యూపీలో డబ్బులు ఇవ్వడం లేదు. మిగతా రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. రైతులపై గాంధీ జయంతి రోజే.. పోలీసులు చేసిన దౌర్జన్యం… రాజకీయ కలకలానికి కారణం అయింది. జై జవాన్ అంటూ రాఫెల్ స్కాంకు పాల్పడ్డారని… జై కిసాన్ అంటూ.. వారిపై దాడి చేశారని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది.