ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న `అరవింద సమేత వీర రాఘవ` ట్రైలర్ వచ్చేసింది. ఎమోషన్, లవ్, ఫ్యాక్షన్, యాక్షన్… వీటన్నింటికి ఎన్టీఆర్ స్టైల్, త్రివిక్రమ్ పెన్ పవర్ మిక్సయిన ఓ కంప్లీట్ ప్యాకేజ్ `అరవింద` లో కనిపించింది. ఎన్టీఆర్ – పూజా హెడ్గేలపై చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్‌తో మొదలైన ట్రైలర్ `నీకు ఫ్యాక్షన్ అంటే తెలుసా` అంటూ పూజా హెడ్గే అడిగిన ప్రశ్నతో – ఈ కథ ఫ్యాక్షన్ వైపు మలుపు తీసుకుంది. “మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం, మీ నాన్న కత్తి ఎత్తినాడంటే అది వారసత్వం, నువ్వు కత్తి దూసినావంటే అది లక్షణం, ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపం అవతుందేమో“ అనే త్రివిక్రమ్ డైలాగ్ తో – ఈ సినిమాలో కథానాయకుడి లక్షణం ఏమిటి? లక్ష్యమేమిటన్నది త్రివిక్రమ్ అత్యంత స్పష్టంగా చెప్పేశాడు. `వాడిదైన రోజున ఎవడైనా కొడతాడు. అసలు గొడవ జరక్కుండా ఆపుతాడు చూడు.. వాడే గొప్ప` అనే కథానాయిక డైలాగ్ కూడా ఈ కథ ఆత్మని తెలియజేస్తోంది. ఫ్యాక్షన్ గడ్డపై ఈ కత్తుల యుద్ధం వద్దు అనే పోరాడే యువకుడి కథే `అరవింద సమేత` అని ట్రైలర్ ద్వారా త్రివిక్రమ్ చెప్పేశాడు. త్రివిక్రమ్ మాటల్లో మరో కోణం అరవింద సమేతలో ఆవిష్కృతమైందనిపిస్తోంది. ప్రతీ మాటా బలమైనదే. కత్తికంటే పదునైనదే. రెగ్యులర్‌గా వినిపించే త్రివిక్రమ్ పంచ్‌లు ఇందులో కనిపించలేదు. వినిపించలేదు. కానీ గుండెని హత్తుకునే సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ రౌద్రం, పూజా అల్లరి, యాక్షన్, ఫ్యాక్షన్.. ఇవన్నీ అలరించడానికి సిద్ధంగాఉన్నాయి. ఈ ట్రైలర్ `సినిమా సూపర్ హిట్టు` అనే సంకేతాలను అందిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులకు, త్రివిక్రమ్‌ని అమితంగా ఇష్టపడేవాళ్లకూ అదే కదా కావల్సింది..!