ప్రీ రిలీజ్ ఫంక్షనంటే.. డాన్సులు, జోకులు.. ఇలా అల్లరి అల్లరిగా హుషారు హుషారుగా సాగుతుంది. కానీ అందుకు విరుద్ధంగా సాగింది `అరవింద సమేత వీరరాఘవ` ఫంక్షన్. ఇటీవలే నందమూరి హరికృష్ణ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదం ఇంకా నందమూరి సోదరులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మొహాల్లో కనిపిస్తూనే ఉంది. `రం.. రుధిరం.. సమరం` అనే పాట వేదికపై ఆలపిస్తున్నప్పుడు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు చాలా ఎమోషనల్‌గా కనిపించారు. ఇది చావుకి సంబంధించిన పాట. అందుకే తండ్రిని గుర్తు చేసుకుని కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ విశ్వప్రయత్నం చేశారు. కానీ కన్నీళ్లు మాత్రం ఆగలేదు. కల్యాణ్ రామ్ స్పీచ్‌లోనూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. తాతయ్యనీ, నాన్ననీ గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. కుటుంబం కంటే వృత్తికి గౌరవమిచ్చే కుటుంబం నుంచి వచ్చామని, అందుకే నాన్న పోయిన 5వ రోజునే ఎన్టీఆర్ షూటింగ్ కి వెళ్లాడని, అనుకున్న సమయంలో ఈ సినిమా విడుదల అవ్వడానికి రాత్రి పగలూ కష్టపడ్డాడని చెప్పుకొచ్చాడు కల్యాణ్‌రామ్. `రం.. రుధిరం.. సమరం` పాటలోని కొన్ని పంక్తులు పాడి.. ఆ పాటలో నాన్నని గుర్తు చేసుకోవడం అభిమానుల గుండెల్ని పిండేసేలా చేసింది. `పెనిమిటీ` పాటని ఆలపిస్తున్నప్పుడు కూడా ఎన్టీఆర్ కళ్ల నిండా నీళ్లు కనిపించాయి.