త్రివిక్రమ్ ఎంత బాగా రాస్తాడో, అంతే బాగా మాట్లాడతాడు. త్రివిక్రమ్ గొప్ప వక్త. బయట విడిగా వేదికలపై పెద్దగా స్పీచులు ఇవ్వడుగానీ, తన ఆడియో ఫంక్షన్లలో మాత్రం బాగా మాట్లాడతాడు. ఆ స్పీచులు కొన్ని తన సినిమాలకంటే గొప్పగా ఉంటాయి. ఆ వీడియోల్ని యూ ట్యూబ్‌లో మళ్లీ మళ్లీ చూసుకుని, వింటూ మురిసిపోతుంటారు త్రివిక్రమ్ అభిమానులు. అత్తారింటికి దారేది, అ.ఆ, అజ్ఞాతవాసి.. ఇలా ప్రతీ వేడుకలోనూ త్రివిక్రమ్ స్పీచులు హైలెట్‌గా నిలుస్తుంటాయి. అందుకే అరవింద సమేత వీర రాఘవ ఆడియో ఫంక్షన్ కోసం కూడా త్రివిక్రమ్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈసారి త్రివిక్రమ్ ఇంకెంత గొప్పగా మాట్లాడతాడో అని ఆసక్తి కనబరిచారు. అయితే త్రివిక్రమ్ ఈసారి స్పీచ్ లెస్‌గా కనిపించి.. అభిమానుల్ని నిరాశ పరిచాడు. కొన్నిసార్లు మాట్లాడడం కంటే మాట్లాడకపోవడమే ఉత్తమం. ఇది నాకు అలాంటి పరిస్థితి అంటూ… తాను తక్కువగా మాట్లాడడానికి తగిన కారణమే చెప్పాడు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొన్న ఎన్టీఆర్‌ని రియల్ హీరోగా అభివర్ణించాడు త్రివిక్రమ్. నటీనటులకూ, సాంకేతిక నిపుణులకూ అభినందలు కృతజ్ఞతలు చెప్పడం తప్ప… త్రివిక్రమ్ మాట్లాడింది లేదు. ఇంత పొడి పొడిగా త్రివిక్రమ్ మాట్లాడడం బహుశా ఈమధ్యకాలంలో ఇదే తొలిసారి.
త్రివిక్రమ్ వైఖరి వెనుక బలమైన కారణాలున్నాయి. ఒకటి.. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నందమూరి హరికృష్ణ తలపులతో కాస్త ఎమోషనల్‌గా మారిపోవడం. కల్యాణ్ రామ్ మాటలు, ఎన్టీఆర్ హావభావాలు.. ఈ ప్రీ రిలీజ్ వేడుకను భారంగా మార్చేశాయి. ఇలాంటి సమయంలో మాట్లాడడం మంచిది కాదని త్రివిక్రమ్ భావించి ఉంటాడు. పైగా.. అజ్ఞాతవాసి ఎఫెక్ట్ త్రివిక్రమ్‌పై బలంగా పడి ఉంటుంది. `మాటల్లో కాదు.. చేతల్లో చూపిద్దాం` అని బలంగా ఫిక్సయిపోయినట్టు అనిపించింది. త్రివిక్రమ్ మాట్లాడకపోయినా.. ఆ ట్రైలర్ ఈ రోజు మాట్లాడింది. అందులో త్రివిక్రమ్ పదును తగ్గలేదన్న నిజం.. అందరికీ అర్థమైంది. సక్సెస్ మీట్లో అయినా…. త్రివిక్రమ్ మైకు కు కాస్త పని చెబుతాడేమో చూడాలి.