సమస్యలు పరిష్కరించాలంటూ.. వెల్లువలా ఢిల్లీకి తరలి వచ్చిన రైతుల్ని.. కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీలు ఝుళిపించారు. బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. వాటర్ క్యానన్లతో తరిమికొట్టారు. కిసాన్ క్రాంతి ర్యాలీ పేరుతో.. రైతులు వేల సంఖ్యలో ఢిల్లీకి వచ్చారు. అనుమతి లేదంటూ ఘజియాబాద్ దగ్గర రైతుల ర్యాలీని వాటర్కెనాన్లతో ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లతో రహదారులను మూసివేశారు. రుణమాఫీ, మద్దతు ధర, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ…భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన నిర్వహి్సతున్నారు. ఢిల్లీలోకి అడుగుపెట్ట నీయకుండా పోలీసులు రైతులపై ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయారు.
అణచి వేసే ప్రయత్నాలను రైతులు ధీటుగా ఎదుర్కొన్నారు. ఎంత కట్టడి చేసిన మహా పాదయాత్రను విరమించేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్‌కు చేరుకునే వరకు తమ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని రైతులు చెబుతున్నారు. పరిస్థితి దిగజారుతూండటంతో రైతుల ప్రధాన డిమాండ్లలో కొన్నింటిని కేంద్రం అంగీకరించింది, మొత్తం డిమాండ్లపై హామీ ఇచ్చే వరకు పాదయాత్ర విరమించేది లేదని రైతులు చెబుతున్నారు. తూర్పు ఢిల్లీలో 144 సెక్షన్ ను అమలు చేశారు. పాదయాత్ర కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. మీరట్ జాతీయరహదారి పైకి వాహనాలను పూర్తిగా నియంత్రించారు. పంటలకు గిట్టుబాటు ధరతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలుపై మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను సాధించుకునే వరకు పోరాటం ఆపబోమని రైతులు తేల్చి చెబుతున్నారు.
రైతుల్నిశాంతింపజేసేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రైతుల డిమాండ్లను ముఖ్యమంత్రుల కమిటీ పరిశీలిస్తుందని కేంద్రం ఇచ్చిన హామీని రైతుల ప్రతినిధులు తోసిపుచ్చారు. రైతులు వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌తో కలిసి హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరిపారు. రైతుల ఆందోళనను ఎలా విరమింపజేయాలనే అంశంపై మంత్రులతో సమాలోచనలు జరిపిన రాజ్‌నాథ్.. భారత్ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్‌తో ఫోన్లో మాట్లాడి రైతుల డిమాండ్లన్నింటినీ పరిశీలిస్తామని చెప్పారు. అయితే, ప్రభుత్వ హామీతో తాము సంతృప్తి చెందడం లేదని పేర్కొన్న నరేశ్.. తమ ఆందోళనను కొనసాగిస్తామని రాజ్‌నాథ్‌కు స్పష్టం చేశారు. బీజేపీని ఇరుకున పెట్టడానికి ఇంత కన్నా మంచి అవకాశం విపక్షాలకు ఏముంటుంది..? రైతులపై పోలీసులు లాఠీలు ఝళిపించడంతో పాటు బాష్ప వాయువు, జల ఫిరంగులను ప్రయోగించడాన్ని విపక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. లాఠీ ఛార్జిని దారుణమైన పోలీస్ చర్యగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణించారు. దిల్లీ సుల్తాన్ అనే ద్రావణాన్ని సేవించారంటూ పరోక్షంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఈ రైతుల సెగ… చాలా గట్టిగానే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.